జోడెద్దుల మాదిరిగా సంక్షేమం, అభివృద్ధి 

9 Oct, 2021 03:30 IST|Sakshi

దేశంలోనే అరుదైన పాలన అని కేటీఆర్‌ వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి అనే జోడెద్దుల మాదిరి పాలన యావత్‌ దేశంలోనే అరుదైన సందర్భమని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల సమ్మిళిత అభివృద్ధిని ఏకకాలంలో సమాంతరంగా, బృహత్తరంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం– అభివృద్ధి, వ్యవసాయం–పరిశ్రమలు, పల్లెలు–పట్టణాల అభివృద్ధి సాగు తోందని చెప్పారు.

శుక్రవారం శాసనమండలిలో పల్లె, పట్టణ ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 3 శాతమున్న పట్టణ భూభాగంలో 50 శాతం దాకా జనాభా నివసిస్తుండటంతో మౌలిక వసతులపై ఒత్తిడి పెరిగిందని చెప్పారు. అయితే ఆర్థిక చోదకశక్తిగా పట్టణాలు పాత్ర పోషిస్తూ విద్య, ఉపాధి తదితరాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు. 

ఆస్పత్రులు, స్కూళ్లపై దృష్టి: ఎర్రబెల్లి 
ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్లకు వనరుల కల్పనతోపాటు మెరుగైన వసతుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధికి కచ్చితమైన చర్యలు చేపడుతోందన్నారు. పీఆర్‌ శాఖకు సంబంధించి 32 జిల్లాల్లో ఒక్క ఖాళీ పోస్టు లేకుండా భర్తీ చేశామని, 20 ఏళ్లకుపైగా ఒకే పోస్టులో పనిచేస్తున్నవారికి పదోన్నతులు కల్పించామన్నారు. 2004 నుంచి 2014 దాకా గత ప్రభుత్వాలు పంచాయతీలకు సమకూర్చిన నిధులు రూ.4,357 కాగా, టీఆర్‌ఎస్‌ ఏడేళ్ల పాలనలో రూ.13,767 కోట్లు కేటాయించారన్నారు.

పదేళ్లలో గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.12,173 కోట్లు ఖర్చు చేస్తే, గత ఏడేళ్లలో తమ ప్రభుత్వం రూ.58,303 వ్యయం చేసిందని వివరించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక ఆశించినస్థాయిలో వేగవంతమైన అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు బాగా పెరిగినందున వాటిని అందుకునే స్థితిలో అభివృద్ధి జరిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పురాణం సతీష్‌కుమార్, దయానంద్‌ ఈ చర్చలో పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు