వచ్చేనెల నుంచి కొత్త బీసీ గురుకులాలు

3 Sep, 2022 00:52 IST|Sakshi

అక్టోబర్‌ 11న పాఠశాలలు, 15న డిగ్రీ కాలేజీలు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్‌ 11వ తేదీన 33 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు బీసీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా వచ్చేనెల 15వ తేదీన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు సైతం అందుబాటులోకి రానున్నాయి.

ఆయా తేదీల నుంచే తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, గురుకుల సొసైటీ కార్యదర్శితో ఆయన సమీక్ష నిర్వహించారు. నూతనంగా ప్రారంభించనున్న గురుకుల విద్యా సంస్థల్లో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్టున్నట్లు తెలిపారు.

సాగర్‌ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం హాలియాలో, అలాగే దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్ల, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ప్రారంభించనున్న కొత్త గురుకులాలతో కలిపి బీసీ గురుకుల సొసైటీ పరిధిలో విద్యా సంస్థల సంఖ్య 310కి చేరిందని వివరించారు.

ఆత్మగౌరవ భవనాలకు 8న అనుమతి పత్రాలు
బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ బాధ్యతలను ఏక సంఘంగా ఏర్పడిన కుల సంఘాలకు అప్పగిస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. 24 కుల సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవంగా నిర్మాణ అనుమతులు పొందాయన్నారు. ఇలా ఏక సంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునే వారికి ఈ నెల 8న అనుమతి పత్రాలు అందజేస్తామని చెప్పారు.

ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనుండటంతో.. ప్రస్తుతం ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లకు అదనంగా మరో 50 స్టడీ సెంటర్లు తెరిచి గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, బీసీ స్టడీ సర్కిల్స్‌ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు