అమ్మకు పోషకాల కానుక..

28 Jul, 2022 01:43 IST|Sakshi

కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్‌ పంపిణీకి ఏర్పాట్లు 

ఖర్జూరం, నెయ్యి, ఇతర బలవర్ధక పదార్థాలు 

తమిళనాడు తరహాలో బాక్స్‌ లేదా ఏదైనా బ్యాగ్‌తో కిట్‌ 

ముందుగా 9 జిల్లాల్లో ఇచ్చేందుకు ప్రణాళిక  

సాక్షి, హైదరాబాద్‌: గర్భిణీల ఆరోగ్యం కోసం కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్‌ను అందజేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెలలో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కిట్‌లో సమకూర్చే పోషకాహార పదార్థాలను అందజేసే ఏజెన్సీ కోసం టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్లు ఖరారయ్యాక న్యూ ట్రీషన్‌ కిట్‌లను మహిళలకు పంపిణీ చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

పోషకాహార కిట్‌లో ఒక కేజీ న్యూట్రీషనల్‌ మిక్స్‌ పౌడర్‌ (రెండు బాటిళ్లు), ఒక కేజీ ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్‌ సిరప్, ఒక అల్బెండజోల్‌ మాత్ర, అర కేజీ నెయ్యి ఉంటుంది. కిట్‌లో ఒక ప్లాస్టిక్‌ కప్‌ను కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఉంచేలా ఒక బాక్స్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బాక్స్‌ ఇవ్వాలా లేదా ఏదైనా బ్యాగ్‌ ఇవ్వాలా లేక కేసీఆర్‌ కిట్‌ మాదిరి ఇవ్వాలా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే తమిళనాడు తరహాలో బాక్స్‌ ఇస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తమిళనాడు నుంచి ఆ బాక్స్‌ను కూడా తెప్పించి పరిశీలించారు.  

ముందుగా తొమ్మిది జిల్లాల్లో అమలు.. 
కేసీఆర్‌ కిట్‌ లాగానే రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహార కిట్‌ను తీసుకురానుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న కొమురంభీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల, నాగర్‌ కర్నూలు, ములుగు జిల్లాల్లోని గర్భిణీల కోసం ముందుగా కేసీఆర్‌ పోషకాహార కిట్‌ పథకం అమలు చేస్తామని వైద్య వర్గాలు వెల్లడించాయి.

ఈ కార్యక్రమం ద్వారా ఏటా 1.25 లక్షల మంది లబ్ధి పొందుతారని ఆ వర్గాలు తెలిపాయి. తదనంతరం రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 54 శాతం పెరిగిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా జూన్‌ 2, 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 లక్షల మంది లబ్ధి పొందారు.

ఈ పథకం అమలుకు సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కిట్‌ వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, అలాగే తల్లీబిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వారు వెల్లడించారు. తాజాగా ఈ న్యూట్రీషన్‌ కిట్‌తో రక్తహీనత తగ్గి గర్భిణలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు.   

మరిన్ని వార్తలు