మార్చి మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్‌

28 Feb, 2021 02:28 IST|Sakshi

మండలి ఎన్నికల తర్వాతే శాసనసభ సమావేశాలు

20 జిల్లాలు, 77 నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు

ఎన్నికల వ్యవహారాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీబిజీ

మార్చి 14 తర్వాతే బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ 

గాడిలో పడిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి..

సానుకూల దృక్పథంతో బడ్జెట్‌ కేటాయింపులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ 2021–22 సమావేశాలు మార్చి మూడో వారంలో జరిగే అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానంతోపాటు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 20 జిల్లాలు, 77 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఏర్పాట్లలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బిజీగా ఉన్నారు. మార్చి 14న పోలింగ్‌ జరగనుండగా 17న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు స్థానాల్లో సైతం తమ పార్టీ అభ్యర్థులను కచ్చితంగా గెలిపించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పోలింగ్‌ జరిగే వరకు మండలి ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మండలి ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాతే రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి 14 తర్వాత ఎప్పుడైనా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. 

సమావేశాలు 15 రోజులే...
వచ్చే ఆర్థిక సంవత్సరాని (2021–22)కి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును మార్చి 31లోగా ఉభయ సభలు తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉండడంతో ఈసారి బడ్జెట్‌ సమావేశాలు 12–15 రోజులకు మించి జరిగే అవకాశాలు లేవు. కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటుండటం కూడా మరో కారణం కానుంది. పోలీసు సిబ్బంది లభ్యత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం శాసనసభ బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌ను మార్చి తొలి వారంలో ఖరారు చేసే అవకాశం ఉంది. శాసనసభ సమావేశాల తొలిరోజు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి ఒకట్రెండు రోజులు చర్చ నిర్వహించనున్నారు. మరుసటి రోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, తదుపరి రోజు సెలవు ఇవ్వడం, తర్వాత రోజుల్లో బడ్జెట్‌పై చర్చ, అనంతరం పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తదితర ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంది. కేవలం 12–15 రోజుల్లో ఈ కార్యక్రమాలను ముగించేలా ప్రభుత్వం శాసనసభ బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఈసారి కూడా శాఖలవారీగా పద్దులపై విస్తృతస్థాయి చర్చ లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. 

సానుకూల దృక్పథంతో బడ్జెట్‌... 
కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే క్రమంగా గాడినపడుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ఆదాయం మినహా జీఎస్టీ, వ్యాట్, ఎక్సైజ్‌ తదితరాల రూపంలో ఆదాయం పుంజుకొని ఇప్పటికే సాధారణ స్థితికి చేరు కుంది. సానుకూల దృక్పథంతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2021–22 రూపకల్పనకు ప్రస్తుత పరిస్థితులు దోహదపడనున్నాయి. బడ్జెట్‌ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో ప్రాథమిక స్థాయిలో చర్చించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నా ఇంకా కీలక దశకు చేరుకోలేదు. ఎప్పటిలాగే బడ్జెట్‌ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరుసగా వారంపాటు సమీక్షలు నిర్వహించాకే శాఖల వారీగా బడ్జెట్‌ అవసరాలు, కేటాయింపులు కొలిక్కి వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ప్రాధామ్యాలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు జరపాల్సిన కేటాయింపులపై సీఎం స్వయంగా నిర్ణయం తీసుకోనున్నారని అధికారులు తెలిపారు. మార్చి తొలివారంలో బడ్జెట్‌ రూపకల్పనపై సీఎం సమీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు