TS: 3 నుంచి సమావేశాలు.. రూ.3 లక్షల కోట్లతో బడ్జెట్‌? 

22 Jan, 2023 04:25 IST|Sakshi

గత అసెంబ్లీ, మండలి సమావేశాలకు కొనసాగింపుగానే ప్రస్తుత భేటీ 

సభలు ప్రోరోగ్‌ కానందున ఈసారీ గవర్నర్‌ ప్రసంగం లేనట్టే! 

మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ, మండలిలో బడ్జెట్‌ సమర్పణ 

తర్వాతి రెండు రోజులు విరామం.. 6వ తేదీ నుంచి చర్చలు 

బడ్జెట్‌ ముసాయిదాపై శనివారం సమీక్షించిన సీఎం కేసీఆర్‌ 

వివిధ పద్దులు, ప్రతిపాదనలపై చర్చ.. ఈసారి బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు? 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీన (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. తొలుత ఉభయసభల్లో.. ఇటీవలికాలంలో మరణించిన మాజీ సభ్యులకు సంతాపం ప్రకటిస్తారు. తర్వాత మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2023–24ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమర్పిస్తారు. 4, 5 తేదీల్లో సమావేశాలకు విరామం ఇచ్చి.. 6వ తేదీ నుంచి బడ్జెట్‌పై చర్చ కొనసాగించనున్నారు. అయితే ఉభయసభల నిర్వహణకు సంబంధించి ఫిబ్రవరి 3న జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)ల సమావేశంలో షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. 

ఎనిమిదో సమావేశంలో.. నాలుగో విడత.. 
ప్రస్తుత శాసనసభ, మండలి సమావేశాలను తాజా ప్రభుత్వంలో ఎనిమిదో పర్యాయంలో నాలుగో విడతగా పరిగణించనున్నారు. 2018లో తెలంగాణలో రెండో ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో ఇప్పటివరకు ఎనిమిది పర్యాయాలు అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిగాయి (ఎప్పుడైనా అసెంబ్లీ/మండలి సమావేశాలను ప్రోరోగ్‌ (నిరవధిక వాయిదా) చేస్తే ఆ పర్యాయం ముగిసినట్టు లెక్క. ప్రోరోగ్‌ చేయకుంటే ఇంకా ఆ పర్యాయం కొనసాగుతున్నట్టుగానే పరిగణిస్తారు). 2021 సెపె్టంబర్‌లో ఎనిమిదో పర్యాయం సమావేశాలు మొదలయ్యాయి. వాటిని ప్రోరోగ్‌ చేయకుండానే.. తర్వాత మరో రెండు విడతలుగా సమావేశాలు నిర్వహించారు. అంటే ఎనిమిదో పర్యాయంలో మూడు విడతలు అయ్యాయి. వచ్చేనెల 3న మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాలు నాలుగో విడత కానున్నాయి. 

డిసెంబర్‌లో నిర్వహిస్తామన్నా.. 
చివరిగా గత ఏడాది సెపె్టంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాత డిసెంబర్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, కేంద్ర వివక్షను వివరించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కానీ జరగలేదు. అధికారిక, బీఆర్‌ఎస్‌ కార్యకలాపాల్లో కేసీఆర్‌ బిజీగా ఉండటంతో ప్రత్యేక సమావేశాలు చేపట్టలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

గవర్నర్‌ ప్రసంగం ఈసారీ లేనట్టే! 
ఇంతకుముందు జరిగిన శాసనసభ, మండలి సమావేశాలను ప్రొరోగ్‌ చేయని నేపథ్యంలో.. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనూ గవర్నర్‌ తమిళిసై ప్రసంగించే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్‌కు సాగుతున్న విభేదాలే దీనికి కారణమని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. గత ఏడాది బడ్జెట్‌ సమావేశాలు కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. ఇక 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 40 ఆర్డినెన్సులు జారీ చేయగా.. అందులో అత్యధికంగా 2016లో 11 ఆర్డినెన్స్‌లు ఇచ్చింది. అయితే 2021 నుంచి గవర్నర్‌తో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్డినెన్సులు ఇవ్వలేదు. వాటికి ఆమోదం రాకపోవచ్చనే ఉద్దేశమే దీనికి కారణం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 7 బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపినా.. అందులో ఆరు బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపైనా సస్పెన్స్‌ నెలకొంది. 

రూ.3 లక్షల కోట్లతో బడ్జెట్‌? 
రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలకు తుదిరూపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆర్థికమంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. 2023–24 బడ్జెట్‌ ముసాయిదా ప్రతిపాదనలపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ లోతుగా సమీక్షించి.. పలు సవరణలు, మార్పుచేర్పులు సూచించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2023–24 బడ్జెట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ రూ.2.56 లక్షల కోట్ల కంటే 13 నుంచి 15 శాతం అధికంగా ఉండనుంది. అంటే రూ. 2.95 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌ను ప్రాథమికంగా ఆమోదించేందుకు ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.  

మరిన్ని వార్తలు