ప్రతిమూలకు ‘ఎత్తిపోత’

15 Jul, 2021 01:50 IST|Sakshi

రాష్ట్రంలో సాగుయోగ్యమైన భూమంతటికీ నీరందేలా కార్యాచరణ

సాగునీరందని ఆయకట్టుకు దగ్గరి రిజర్వాయర్లు, కాల్వల నుంచి ఎత్తిపోతలు

ఇప్పటికే కొన్ని ఎత్తిపోతలకు ప్రభుత్వం అనుమతి

సర్కారు పరిశీలనలో మరో 100 పథకాలు

  • రాష్ట్రంలో ఉన్న ఎత్తైన ప్రాంతాల్లోని సాగు నీరందని ప్రతి ప్రదేశానికి నీరు పారించేలా అవసరమైన చోట చిన్న ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రభుత్వం తాజాగా ప్రణాళిక రచిస్తోంది.
  • రాష్ట్రంలో 1.67 కోట్ల ఎకరాల భూమి సాగుకు అర్హమైనదిగా గుర్తించిన ప్రభుత్వం, ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది పోనూ మిగిలిన మరో 42 లక్షల ఎకరాల భూమిపై దృష్టి పెట్టింది.

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా కృషిని కొనసాగిస్తున్న ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మూలకూ నీరందించే బృహత్‌ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన భారీ ఎత్తిపోతల పథకాల పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాల్వల్లోని నీటిని వినియోగిస్తూ.. ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే కొన్ని ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయగా, మరో 100 ఎత్తిపోతల పథకాలు సర్కారు పరిశీలనలో ఉన్నాయి. మొదటగా కరీంనగర్‌ జిల్లా 13 నియోజకవర్గాల్లోని ప్రతి మండలానికి నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధమవుతుండగా, తదనంతరం ప్రతి జిల్లాకు ఇదేవిధమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకెళ్లనుంది.

42 లక్షల ఎకరాలపై సర్కారు దృష్టి
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2.76 కోట్ల ఎకరాల విస్తీర్ణం గల భూమి ఉండగా, ఇందులో ప్రస్తుతం చేపట్టిన, చేపట్టనున్న ఎత్తిపోతల పథకాల ద్వారా 1.25 కోట్ల ఎకరాల మేర ఆయకట్టు వృద్ధిలోకి తేవాలని గతంలో ప్రణాళిక ఉంది. ఇందులో ఇప్పటికే భారీ, మధ్య, చిన్నతరహా పథకాల కింద 72 లక్షల ఎకరాల మేర ఆయకట్టు వృధ్ధిలోకి రాగా, మరో 53 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా పనులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో పనులు పూర్తయిన చోట్ల కాల్వలపై ఇప్పటికే 1,200 పైగా చెక్‌డ్యామ్‌లు, మరో 600 తూముల నిర్మాణం జరుగుతోంది. వీటి ద్వారా ఎక్కడికక్కడ నీటిని కట్టడి చేస్తూ సమర్థ వినియోగం జరిగేలా చూస్తున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గ పరిధిలోని ప్రతి మూలకూ నీరందించేలా కార్యాచరణ మొదలు పెట్టారు. 42 లక్షల ఎకరాలకు సాగు నీరందించడంపై దృష్టి సారించారు.

పలు పథకాలకు అనుమతులు
నీరు పారే ప్రాంతాలకు ఎత్తున ఉన్న ఈ 42 లక్షల ఎకరాల భూమికి చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారానే సాగునీటిని అందించగలిగే అవకాశం ఉన్న దృష్ట్యా, ఇప్పటికే ప్రజా ప్రతినిధులు కోరిన చోట వాటికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సంబంధించి సింగూరుపై రెండు ఎత్తిపోతలు చేపట్టి 3.80 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సర్వే పనులు మొదలయ్యాయి. పాలమూరు ప్రాజెక్టులో రెండో రిజర్వాయర్‌గా ఉన్న ఏదుల నుంచి నీటిని తరలిస్తూ అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిద్వారా అత్యంత ఎత్తైన ప్రాంతాలైన అచ్చంపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 70 వేల ఎకరాలకు నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. నల్లగొండ జిల్లాలో జాన్‌పహాడ్, నెల్లికల్, ముక్త్యాల వంటి 13 ఎత్తిపోతల పథకాలకు రూ.3 వేల కోట్లతో పరిపాలనా అనుమతులు ఇవ్వగా, నిజాంసాగర్‌ దిగువన మంజీరా ఎత్తిపోతలకు రూ.700 కోట్లతో అనుమతులు ఇచ్చారు. బాన్సువాడ నియోజకవర్గంలో జకోరా, చండూరు ఎత్తిపోతలకు త్వరలోనే శంకుస్థాపన జరగనుండగా, ఇటీవలే కల్వకుర్తి కాల్వలపై మార్కండేయ ఎత్తిపోతలకు రూ.76 కోట్లతో అనుమతులిచ్చారు. ఇవే కాల్వలపై కర్నెపల్లి తండా ఎత్తిపోతల సర్వే కొనసాగుతోంది. ఇక నిర్మల్‌ జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వలపై రూ.59 కోట్లతో పిప్రి ఎత్తిపోతలు చేపట్టనుండగా, చెన్నూరు నియోజకవర్గానికి నీరిచ్చేలా కాళేశ్వరంలోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల కింద ఎత్తిపోతల పథకాలు చేపట్టి 70 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా తుది ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

తాజాగా రూ.6,300 కోట్ల అంచనా వ్యయంతో..
తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనల మేరకు సుమారు 100 ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటి ప్రాథమిక అంచనా వ్యయం రూ.6,300 కోట్ల మేర ఉండగా, సుమారు 4.50 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవాటిలో భూపాలపల్లి నియోజకవర్గంలో 9, మహబూబాబాద్‌ 4, చొప్పదండి 15, మంథని 7, రామగుండం 5, పినపాక 15, ధర్మపురి 2, మధిరలో 4 వరకు ఎత్తిపోతలు ఉన్నట్లు తెలుస్తోంది.

కరీంనగర్‌లో రంగంలోకి ఇంజనీర్లు
ఇటీవలి కరీంనగర్‌ జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు తొలుత కరీంనగర్‌ జిల్లా నుంచి కార్యాచరణ మొదలు పెట్టారు. జిల్లాలోని లోయర్‌మానేరు, మిడ్‌మానేరు, అప్పర్‌ మానేరు, ఎల్లంపల్లి సహా కాళేశ్వరం కాల్వల పరిధిలో ప్రస్తుతం సాగులో ఉన్న భూమి, సాగులోకి తేవాల్సిన భూమి, ఉన్న చెరువులు, చెక్‌డ్యామ్‌ల వివరాలు ఇంజనీర్లు సేకరిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి, మంథని, రామగుండం, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్, జగిత్యాల నియోజకవర్గాల్లోని భూముల మ్యాపులు పరిశీలించడంతో పాటు, సాగు నీటిని అందించేలా ఎత్తిపోతలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. 

   

మరిన్ని వార్తలు