Telangana New Highways: తెలంగాణలో కొత్తగా మరో 10 హైవేలు

21 May, 2022 02:34 IST|Sakshi

ఈ ఏడాదే పనులు ప్రారంభం

మొత్తం నిడివి 715 కి.మీ.. అంచనా వ్యయం రూ.28,615 కోట్లు

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం, ‘నాగపూర్‌–విజయవాడ’గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలకు శ్రీకారం

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారుల విషయంలో గత కొన్నేళ్లుగా దూసుకుపోతున్న తెలంగాణ, కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో 10 కొత్త రహదారుల (ప్యాకేజీల ప్రకారం) పనులు ప్రారంభించనుంది. 715 కి.మీ. నిడివి ఉండే ఈ రోడ్ల నిర్మాణానికి రూ.28,615 కోట్లు ఖర్చు కానుందని అంచనా. కొద్దిరోజుల క్రితమే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ 258 కి.మీ. నిడివి గల కొత్త రోడ్డుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వీటికి రూ.4,927 కోట్ల వ్యయం కానుంది.

ఈ పనులు ప్రారంభం కాగా కొత్తగా మరో 10 రోడ్ల పనులు ప్రారంభించేందుకు వీలుగా అవార్డులు పాస్‌ చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఏర్పాట్లు చేస్తోంది. కీలకమైన హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డులోని ఉత్తరభాగంతో పాటు నాగ్‌పూర్‌–విజయవాడ మధ్య కొత్తగా నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్‌ యాక్సెస్‌ కంట్రోల్డ్‌ హైవే కూడా ఇందులో ఉంది. ఈ 2 రోడ్లు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌ కావడం విశేషం. వీటితో కలుపుకొంటే గత ఎనిమిదేళ్ల కాలంలో 2,251 కి.మీ. నిడివి గల కొత్త జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది.

భూసేకరణే కీలకం.. : రీజినల్‌ రింగురోడ్డు, నాగ్‌పూర్‌–విజయవాడ కారి డార్‌లో భాగంగా తెలంగాణ పరిధిలో మంచిర్యాల నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా ఏపీ సరిహద్దు వరకు 311 కి.మీ. మేర నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలలో భూసేకరణే కీలకంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. కానీ ఈ రోడ్ల వల్ల పారిశ్రామిక పురోగతికి గొప్ప అవకాశం ఉన్నందున, భూసేకరణ సాఫీగా సాగేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మంచిర్యాల–ఖమ్మం మీదుగా విజయవాడకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో నాగపూర్‌–విజయవాడ మధ్య దూరం 180 కి.మీ.మేర తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ చాలావరకు ఈ కొత్త రోడ్డుమీదుగా డైవర్ట్‌ అవుతుంది. ఇది కొత్త ప్రాంతాల్లో పారిశ్రామిక పురోగతికి దోహదపడటమే కాకుండా,దూరం తగ్గడంతో ఇంధనం, సమయం ఆదా అవుతుంది.

మరిన్ని వార్తలు