సరికొత్తగా ఇంజనీరింగ్‌ బోధన

21 Jun, 2022 02:25 IST|Sakshi

వచ్చే ఏడాది నుంచే అమలు 

పారిశ్రామిక భాగస్వామ్యంతో ప్రాక్టికల్స్‌ 

మిగతా వర్సిటీలదీ ఇదే బాట 

న్యాక్‌ గుర్తింపు కోసం ముమ్మర ప్రయత్నాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ విద్యాబోధనకు కొత్త పాఠ్య ప్రణాళికను పరిచయం చేయబోతున్నారు. ఈ దిశగా ఉన్నత విద్యా విభాగం కసరత్తు చేస్తోంది. సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ నేతృత్వంలో ఇటీవల కొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పనపై వీసీలతో సమావేశం జరిగింది. మారుతున్న ప్రపంచంతో పోటీ పడేలా సాంకేతిక విద్యా బోధన ప్రణాళిక ఉండాలని నవీన్‌ మిత్తల్‌ సూచించారు. జాతీయ విద్యా విధానంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు పేర్కొన్నారు.  

వచ్చే విద్యాసంవత్సరం నుంచే..: ఇటీవల జేఎన్‌టీయూ పాలక మండలి సమావేశంలో కొత్త పాఠ్య ప్రణాళికపై చర్చించింది. కొత్త పాఠ్య ప్రణాళికకు ఆమోదం తెలుపుతున్నట్టు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు తాము సిద్ధమని తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలూ ఇదే దారిలో పయనించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 

ఒకేసారి రెండు డిగ్రీలు: ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విద్యతో పాటు, ఇతర కోర్సులు చేస్తే తప్ప ఉపాధి లభించే అవకాశం కనిపించడం లేదు. చాలామంది ఇంజనీరింగ్‌ తర్వాత క్యాంపస్‌ నియామకాలు లేకపోతే ఇతర కోర్సులు లేదా మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ) కోర్సులు చేస్తున్నారు. అయితే, ఇంజనీరింగ్‌ చేస్తూనే బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి కోర్సులు చేసేందుకు వీలుగా వర్సిటీలు తమ బోధన విధానాన్ని మార్చుకోబోతున్నాయి. దీంతో పాటు తమకు నచ్చిన సబ్జెక్టును అదనంగా జాతీయంగా, అంతర్జాతీయంగా, ఆన్‌లైన్‌ ద్వారా చేసేందుకు అనుమతించాలని యూనివర్సిటీలు భావిస్తున్నాయి.

ఒక విద్యార్థి ఇంజనీరింగ్‌ రెండో ఏడాది పూర్తిచేసి, ఆపేస్తే.. దాన్ని డిప్లొమా పూర్తి చేసినట్టు భావించాలని నూతన విద్యా విధానం పేర్కొంటోంది. ఇందుకు అనుగుణంగా మార్పులు చేసేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలను గ్రేడ్‌లుగా పరిగణిస్తారు. టెన్త్‌ వరకూ ఒక గ్రేడ్, ఇంజనీరింగ్, డిప్లొమా వేర్వేరు గ్రేడులుగా ఉంటాయి. ఈ విధానానికి అనుగుణంగా ఇంజనీరింగ్‌ రెండేళ్లు చేస్తే డిప్లొమా కోర్సుగా భావించాలని జేఎన్‌టీయూహెచ్‌ పాలక మండలి నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు