అమ్మాయివి నీకెందుకమ్మా? నన్ను చూసి నవ్వుకున్నారు..

15 Jul, 2021 07:33 IST|Sakshi
శిరీష, భారతి 

పోలెక్కినా...పోరు తప్పదాయె!

లైన్‌ ఉమెన్‌ అభ్యర్థుల ఆవేదన

ఉత్తీర్ణత సాధించి ఏడాదైనా ఇప్పటికీ అందని నియామక పత్రాలు

ఆది నుంచి అన్నీ అవరోధాలే..

సవాల్‌గా లైన్‌ఉమెన్‌ ఉద్యోగం

లైన్‌ ఉమెన్‌ నియామకాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే రాతపరీక్ష సహా స్తంభాలు ఎక్కే పరీక్షల్లో (పోల్‌ క్లైంబింగ్‌ టెస్టు) విజయం సాధించి అన్ని విధాలుగా సమర్థతను నిరూపించుకున్నప్పటికీ..వారికి ఇప్పటికీ పోస్టింగ్‌ దక్కలేదు. ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన పోలీసు, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవి వంటి రక్షణ రంగాల్లో పెద్దపీట వేస్తూ మహిళాభ్యున్నతికి పాటుపడుతుంటే..మరో వైపు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌)మాత్రం ఇప్పటికీ మహిళల పట్ల వివక్షతను ప్రదర్శిస్తూనే ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారుల తీరు వల్ల లైన్‌ఉమెన్‌గా ఇప్పటికే అన్ని అర్హతలు సాధించిన వాంకుడోతు భారతి, బి.శిరీషలకు ఏడాది కాలంగా నిరీక్షణ తప్పలేదు.

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ 2019 సెప్టెంబర్‌ 28న 2500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిస్కం చట్టం ప్రకారం దరఖాస్తు ఫాంలో మహిళలకు ఆప్షన్‌ ఇవ్వలేదు. అయితే అప్పటికే ఐటీఐ ఎలక్ట్రికల్‌ కోర్సు పూర్తి చేసిన మహబూబ్‌బాద్‌కు చెందిన భారతి, సిద్ధిపేటకు చెందిన శిరీష సహా మరో 30 మంది మహిళలు తమ భవితవ్యంపై ఆందోళన చెందారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 34 మంది ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పురుష అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించినప్పటికీ.. మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించకపోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించారు.

దీంతో 2019 డిసెంబర్‌ 15 వీరికి రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షలో ఇద్దరు మాత్రమే (భారతి, శిరీష)అర్హత సాధించారు. అప్పటికే పురుష అభ్యర్థులకు పోల్‌ క్లైంబింగ్‌ టెస్టు నిర్వహించి.. మహిళా అభ్యర్థులకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో వారు మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు 2020 డిసెంబర్‌ 23న వీరికి ఎర్రగడ్డలోని సెంట్రల్‌ పవర్‌ ఇనిస్టిట్యూట్‌లో పోల్‌ క్‌లైంబింగ్‌ పరీక్ష నిర్వహించారు. వీరిద్దరూ ఎనిమిది మీటర్ల ఎత్తున్న విద్యుత్‌ స్తంభాన్ని ఈజీగా ఎక్కి, పురుషులకు తామేమాత్రం తీసిపోబోమని నిరూపించారు.

అంతేకాదు సంస్థలో లైన్‌ ఉమెన్‌ ఉద్యోగానికి అర్హత సాధించిన తొలి మహిళలుగా చరిత్ర సృష్టించారు. అయితే వీరికి ఇంకా పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వక పోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులోని తొమ్మిదో నెంబర్‌ సింగిల్‌ బెంచి వద్ద పెండింగ్‌లో ఉండిపోవడంతో వారికి నిరీక్షణ తప్పలేదు. అయితే డిస్కం మాత్రం కోర్టు ఆదేశాలు వచి్చన తర్వాతే ఆర్డర్స్‌ ఇస్తామని చెబుతోంది.

ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి? 
మాది సిద్ధిపేట జిల్లా మర్కుకు మండలం గణేష్‌పల్లి గ్రామం. మా అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలే. 2015లో అల్వాల్‌ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఎల్రక్టీషియన్‌ ట్రేడ్‌లో చేరాను. అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్‌ అభ్యంతరం కూడా చెప్పారు. అమ్మాయివి ఈ కోర్సు ఎందుకమ్మా...? మరేదైనా కోర్సు తీసుకోవచ్చు కదా! అని సూచించారు. కానీ నేను వినలేదు. పట్టుబట్టి అదే కోర్సులో చేరి పాసయ్యాను.

2019లో జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చింది. దరఖాస్తు చేసేందుకు వెళ్లితే అందు లో ఫీమేల్‌ ఆఫ్షన్‌ లేకపోవడం ఆందోళన కలిగింది. కొంత మంది యువతులం కలిసి హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు అనుమతి ఇవ్వడంతో రాతపరీక్ష సహా పోల్‌ క్లైంబింగ్‌ కూడా పూర్తి చేశాం. అయినా మాకు ఉద్యోగం రాలేదు. ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలో?.      
– బి.శిరీష, సిద్ధిపేట 

వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలి 
మాది జనగాం జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామ సపీమంలోని సుకారిగడ్డ తండా. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తారు. టెన్త్‌ వరకు అక్కడే చదువుకున్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో  2015లో ఇల్లందు  ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రికల్‌ కోర్సులో చేరాను. నాన్‌ లోకల్‌ కేటగిరిలో డిస్కంకు దరఖాస్తు చేశాను. రాత పరీక్ష కోసం వరంగల్‌లోని ఓ కేంద్రంలో శిక్షణ తీసుకున్నా. 90 మంది పురుష అభ్యర్థుల మధ్య నేను ఒక్కతినే. వారంతా నన్ను చూసి నవ్వుకున్నారు. అయినా నిరుత్సాహ పడలేదు. చివరకు కోర్టు ఆదేశాలతో రాత పరీక్ష, స్తంభం ఎక్కడం వంటి పరీక్షల్లోనూ నెగ్గాను. ఇప్పటికే మూడేళ్లైంది. అయినా ఎదురు చూపులు తప్పడం లేదు. వెంటనే పోస్టింగ్‌ ఆర్డర్‌ ఇచ్చి మాకు న్యాయం చేయాలి.  
– వాంకుడోతు భారతి, జనగాం జిల్లా  

మరిన్ని వార్తలు