ఒక్క రోజు.. రూ. 307 కోట్లు

2 Apr, 2022 02:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మార్చి నెలాఖరు రోజు మద్యం భారీగా అమ్ముడైంది. ఆర్థిక సంవత్సరం చివరి రోజున వెల్లువలా డిపోల నుంచి వైన్, బార్‌ షాపులకు మందు తరలివెళ్లింది. ఈ ఒక్కరోజే రూ.307 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం ఇదే తొలిసారని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెలలో రూ. 2,814 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి బయటకు వచ్చింది.

గతేడాది డిసెంబర్‌లో రూ. 3,459 కోట్ల అమ్మకాల తర్వాత ఇదే ఎక్కువ కావడం గమనార్హం. మరోవైపు 2021–22 ఆర్థిక సంవత్సరం మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయని ఎక్సైజ్‌ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏకంగా రూ. 31,046 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత భారీగా మద్యం అమ్ముడవడం, రూ.30 వేల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. 2020–21తో పోలిస్తే దాదాపు రూ. 5 వేల కోట్లు ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయి. 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తం 3,49,95,281 బీరు కేసులు.. 3,73,93,385 లిక్కర్‌ కేసులు అమ్ముడయ్యాయి. 

మరిన్ని వార్తలు