Telangana: మద్యం అమ్మకాల రికార్డు.. ఏడాది రాబడి తొమ్మిది నెలల్లోనే!

2 Oct, 2022 08:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మద్యం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు మించి సమకూరుతోంది. మందుబాబులు తెగ తాగేసి ఖజానాకు కాసుల కళ తెస్తున్నారు. ఏడాది మొత్తం అమ్మకాల ద్వారా వస్తుందని భావించిన రాబడి కేవలం తొమ్మిది నెలల్లోనే ఖజానాకు చేరే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ ఆదాయం రూ.17,500 కోట్లు రావచ్చని ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాల్లో ప్రతిపాదించింది. సంవత్సరం మొత్తం రూ. 22,500 కోట్ల మేర అమ్మకాలు సాగితే అందులో 70శాతం.. అంటే రూ.17,500 కోట్ల ఆదాయం రావచ్చనేది రాష్ట్ర ప్రభుత్వం లెక్క.

కానీ, తొలి ఆరునెలల్లోనే రూ.17,324 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌బీసీఎల్‌) లెక్కలు వెల్లడిస్తున్నాయి. అందులో 70 శాతం అంటే... దాదాపు రూ.12 వేల కోట్లకుపైగా ఆదాయం ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు చేరిందన్నమాట. ఈ లెక్కనæ మరో రెండు నెలల్లోనే రూ.17,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటుందని అర్థమవుతోంది.

2021 నేషనల్‌ హెల్త్‌ సర్వే–5 ప్రకారం మద్యం ఎక్కువగా సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింల తర్వాత మూడోస్థానాన్ని తెలంగాణ దక్కించుకుంది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో 29 శాతానికిపైగా మందుబాబులున్నారు. ఈ మందుబాబులు తెగ తాగేస్తుండటంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలు కూడా పెంచినందున అంచనాలకు మించి ఆదాయం వస్తుండటం గమనార్హం.  

నాలుగోవంతు రంగారెడ్డిలోనే.. 
రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లెక్కలు చెబుతున్నాయి. 2022 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30  వరకు ఈ జిల్లాలో రూ. 3,970.82 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. రూ.వెయ్యి కోట్ల మార్కు దాటిన జిల్లాల్లో హైదరాబాద్‌ (రూ.1,828.10 కోట్లు), కరీంనగర్‌(1,469.93), ఖమ్మం(1,100.38), మహబూబ్‌నగర్‌ (1,233.53),మెదక్‌ (1,424.09), నల్లగొండ(1,774.46), వరంగల్‌ అర్బన్‌ (రూ.1,745.73 కోట్లు) ఉన్నాయి.

రాష్ట్రంలోని ఈ ఎనిమిది జిల్లాల్లోనే రూ.14 వేల కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరగ్గా, మిగిలిన అన్ని జిల్లాలు కలిపి రూ.3 వేల కోట్ల మేర అమ్మకాలు జరగడం విశేషం. కేసులవారీగా పరిశీలిస్తే గత ఆరునెలల్లో రాష్ట్రంలోని మందుబాబులు 1.7 కోట్ల లిక్కర్‌ కేసులు, 2.5 కోట్ల బీర్‌ కేసులు లాగించేశారని గణాంకాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు