సీసీఎస్‌ బకాయిల కోసం రూ.500 కోట్లు

23 Aug, 2021 04:27 IST|Sakshi
ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో భేటీ అయిన మంత్రి పువ్వాడ

నేషనల్‌ కో–ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం 

ప్రభుత్వ పూచీకత్తుతో ఆర్టీసీకి చెల్లింపు 

వాటిని ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి చెల్లింపు 

ఆర్టీసీ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో రవాణా మంత్రి అత్యవసర భేటీ 

బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా రుణం తీసుకుని ఇవ్వాలని నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సహకార పరపతి సంఘం (సీసీఎస్‌) నిధులను పూర్తిగా వాడేసుకుని ఉద్యోగులకు రుణాలు, విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ చెల్లించకుండా గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దేందుకు సిద్ధపడింది. కేవలం సీసీఎస్‌ బకాయిలు చెల్లించేందుకు వీలుగా నేషనల్‌ కో–ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) నుంచి రూ.400 కోట్ల రుణం తీసుకుని ఆర్టీసీకి అందించాలని నిర్ణయించింది.

ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వనుంది. సీసీఎస్‌ నిల్వ మొత్తాన్ని వాడుకోవడం, ప్రతినెలా దానికి జమ చేయాల్సిన మొత్తాన్ని ఎగ్గొడుతున్న ఫలితంగా దానికి ఆర్టీసీ దాదాపు రూ.950 కోట్ల వరకు బకాయి పడింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం కష్టంగా మారడంతో ముందుగా రూ.500 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్‌సీడీసీ నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది.  

అప్పుడు వద్దనుకుని.. 
నిజానికి ఎన్‌సీడీసీ నుంచి రుణం తీసుకునే అంశం దాదాపు మూడు నెలల క్రితమే చర్చకొచ్చింది. అప్పుడు ఆ కార్పొరేషన్‌తో అధికారులు చర్చించారు. సాధారణంగా ఎన్‌సీడీసీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందిన సహకార సంస్థలకే రుణాలిస్తుంది. సీసీఎస్‌ కూడా సహకార సంస్థే కావటంతో రుణం ఇచ్చేందుకు అప్పట్లో అంగీకరించినట్లు తెలిసింది. అయితే రుణం నేరుగా సీసీఎస్‌కే ఇస్తామని, ఆర్టీసీకి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నట్టు సమాచారం. తీసుకునే రుణంలో కొంత సీసీఎస్‌కు ఇచ్చి, మిగతాది తమ అవసరాలకు వాడుకోవాలన్న యోచనలో ఉన్న ఆర్టీసీ అందుకు అంగీకరించలేదు.

ఫలితంగా అప్పట్లో ఆ రుణ అంశం అటకెక్కిందని తెలిసింది. ఇప్పుడు సీసీఎస్‌ పరిస్థితి దారుణంగా తయారు కావటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో డబ్బు దాచుకుని నెలనెలా వడ్డీ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులు ఇటీవల బస్‌భవన్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. దీనికి సంబంధించి ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. సీసీఎస్‌లో సభ్యత్వం ఉండటం.. నెలనెలా జీతంలో కోత పడుతుండటంతో ఏకంగా సభ్యత్వాలనే మూకుమ్మడిగా రద్దు చేసుకోవాలని ఉద్యోగులు భావిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సీసీఎస్‌ మూసివేతకు రంగం సిద్ధం అయిన తీరుపై ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది.

దీంతో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. గతంలో వద్దనుకున్న ఎన్‌సీడీసీ రుణాన్ని తిరిగి తీసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు ఇవ్వాలనే విషయంపై చర్చించారు. దీనికి ఆర్థిక శాఖ అంగీకరించడంతో ఆ రుణం పొందేందుకు మార్గం సుగమమైంది.  

బడ్జెట్‌లో పేర్కొన్న రుణం అందినట్టే.. 
బడ్జెట్‌(2021–22)లో ఆర్టీసీకి రూ.1,500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రభుత్వ బ్యాంకు నుంచి రూ.వేయి కోట్ల రుణంపై చర్చించగా, తొలుత రూ.500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మొత్తం దాదాపు నెలన్నర క్రితం అందింది. అది ఖర్చు చేశాక మరో రూ.500 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు ఆ బ్యాంకు పేర్కొంది. వెరసి రూ.వేయి కోట్లు అక్కడి నుంచి రానుండగా, తాజాగా ఎన్‌సీడీసీ నుంచి మరో రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించడంతో ప్రభుత్వ రుణం దాదాపు ఆర్టీసీకి అందినట్లు అవుతుంది.  

ఉద్యోగుల బకాయిలకు  వినియోగం? 
దాదాపు నెలన్నర క్రితమే అందిన రూ.500 కోట్ల బ్యాంకు రుణాన్ని ఎలా ఖర్చు చేయాలనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేక అలాగే ఉంచారు. ఇప్పుడు వాటిని ఉద్యోగుల బకాయిల కింద వాడాలని భావిస్తున్నట్లు సమాచారం. సీసీఎస్‌కు ఎన్‌సీడీసీ రుణాన్ని ఇవ్వనుండగా, ఉద్యోగులకు ఉన్న బాండ్ల బకాయిలు, వేతన సవరణ బకాయిలు, విశ్రాంత ఉద్యోగుల బకాయిలకు వాటిని వాడాలని భావిస్తున్నట్లు తెలిసింది. అద్దె బస్సు బకాయిలు కూడా చెల్లించాలని అనుకుంటున్నట్లు సమాచారం. వాటి వ్యయంపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టత వచ్చాక వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు