Telangana: లాక్‌డౌన్‌ ఎత్తివేత!?

7 Jun, 2021 02:51 IST|Sakshi

జూన్‌ 20 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు 

8న కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే చాన్స్‌

 కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే... 

‘థర్డ్‌వేవ్‌’పైనా చర్చించనున్న మంత్రివర్గం 

డయాగ్నొస్టిక్‌ సెంటర్ల ప్రారంభ కార్యక్రమం 9వ తేదీకి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో పగటి పూట లాక్‌డౌన్‌ ఎత్తివేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా రెండో వేవ్‌ క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్‌డౌన్‌కు సడలింపు ఇచ్చి, ఆ సమయంలో మాత్రమే అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలలోగా ప్రజలు ఇళ్లకు చేరుకునేలా వెసులుబాటు కల్పించారు. ప్రస్తుత లాక్‌డౌన్‌కు సంబంధించిన ఉత్తర్వుల గడువు ఈ నెల 9వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. తర్వాత ఏం చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే పగటి పూట లాక్‌డౌన్‌ ఎత్తివేసి, రాత్రి కర్ఫ్యూను మాత్రం కొనసాగించాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం.

రాత్రి 7 గంటలు లేదా 9 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలను అనుమతించాలని, రాత్రి 8 లేదా 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం లాక్‌డౌన్‌ ఎత్తివేత, తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తూ వస్తున్నప్పటికీ అది కరోనా పాజిటివ్‌ కేసుల తగ్గుముఖంపై ప్రభావం చూపలేదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పగటి పూట పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే దిశగా మంత్రివర్గం ఆలోచన చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 20 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగేలా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.   

థర్డ్‌వేవ్‌కు సమర్థవంతంగా చెక్‌ 
కరోనా థర్డ్‌ వేవ్‌ వార్తల నేపథ్యంలో, ఒకవేళ వస్తే సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చిన్నారులకు అవసరమైతే వైద్య చికిత్స అందించేందుకు చేయవలసిన ఏర్పాట్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, వైద్య నిపుణుల భర్తీపై కేబినెట్‌ చర్చించనుంది. నీలోఫర్‌ పిల్లల ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రితో పాటు గాంధీ, నిమ్స్‌ వంటి ఆస్పత్రుల్లో చిన్నారులకు అవసరమైన చికిత్స ఏర్పాట్లను చేసే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం. 

వ్యవ‘సాయం’పైనా చర్చ 
    వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయంగా రైతుబంధు పంపిణీ, ధరణిలో వచ్చిన భూసమస్యల పరిష్కారం, పంటల కొనుగోళ్లు, వర్షాలతో దిగుబడులు తడిచి రైతులకు వాటిల్లిన నష్టం, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు.. క్రిమిసంహారక మందుల లభ్యత, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం–పురోగతి తదితర అంశాలపై కూడా రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. 

9న డయాగ్నస్టిక్‌ సెంటర్ల ప్రారంభం 
     రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 19 డయాగ్నస్టిక్‌ సెంటర్లను సోమవారం ప్రారంభించాల్సి ఉండగా, ఈ నెల 9న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు పాల్గొనేలా, ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం భావిస్తున్నారు. మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్‌ సెంటర్లను  ప్రారంభించనున్నారు. ఎవరు ఎక్కడ పాల్గొనాలనే విషయంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.  

  • రాత్రి 7 గంటలు లేదా 9 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలను అనుమతించి, రాత్రి 8 లేదా 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించే యోచన.  
  • రైతుబంధు పంపిణీ, భూసమస్యలపరిష్కారం, పంటల కొనుగోళ్లు, వర్షాలతో రైతులకు వాటిల్లిన నష్టం తదితర అంశాలపై చర్చించనున్న కేబినెట్‌ 
మరిన్ని వార్తలు