ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ

23 Feb, 2022 14:03 IST|Sakshi

భవన నిర్మాణ అనుమతుల్లో లభించని తగ్గింపు

రసీదులు లేకపోవడంతో అదనపు భారం

2020లో 1.81 లక్షలకుపైగా దరఖాస్తుల రాక 

పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడకు చెందిన కృష్ణమూర్తి తన 200 చదరపు గజాల స్థలంలో భవన నిర్మాణం కోసం మున్సిపల్‌ అధికారులను సంప్రదించాడు. రెండేళ్ల క్రితం ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. నిబంధనల మేరకు అప్పటి మార్కెట్‌ ధర ప్రకారమే భవన నిర్మాణ ఫీజు నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ.. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న రసీదు తన దగ్గర లేకపోవడంతో అధికారులు ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం చెల్లించాలని సూచించారు.  
 
తుర్కయాంజల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరుకు చెందిన ఓ మహిళ తన 150 గజాల స్థలం కోసం 2020లోనే ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన రసీదు లేకపోవడంతో ‘ఎల్‌ఆర్‌ఎస్‌ తెలంగాణ’ వెబ్‌సైట్‌ నుంచి పొందేందుకు ప్రయత్నించింది. ఆమెకు సదరు వెబ్‌సైట్‌ నుంచి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో చేసేదేమీలేక ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం సుమారు రూ.1.12 లక్షలు చెల్లించారు. 
 
సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ బీ పాస్‌లో దరఖాస్తు చేసుకొనే వారికి సైతం ఎల్‌ఆర్‌ఎస్‌ రసీదులు లేకపోవడంతో పెద్ద మొత్తంలో భారం పడుతోంది. గతంలో రూ.1000 చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో  భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే 14 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుతో పాటు  అప్పటి  మార్కెట్‌ ధర ప్రకారం  భవన నిర్మాణ రుసుమును చెల్లించే  వెసులుబాటు ఉంది. కానీ చాలా మంది తమ వద్ద అప్పటి రసీదు లేకపోవడం, వాటిని వెబ్‌సైట్‌ నుంచే పొందే అవకాశం కూడా లేకపోవడంతో ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం అదనంగా చెల్లించాల్సివస్తోంది.  

స్తంభించిన సేవలు..  
► ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లుగా ఎదురు చూసిన ఎంతో మంది భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నప్పటికీ  ఫీజులు మాత్రం ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 2020 నాటి మార్కెట్‌ ధర ప్రకారం చెల్లించే వెసులుబాటు ఉంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10 వేల నుంచి  రూ.లక్ష వరకు కూడా తగ్గింపు ఉండే అవకాశం ఉంది. కానీ చాలా మంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్‌ఆర్‌ఎస్‌ రసీదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  

► నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్‌లైన్‌లో వివరాలు లభించకపోవడంతో  14 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుముతో పాటు ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. రసీదు లేని వాళ్లు  ఎల్‌ఆర్‌ఎస్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయం ఉంది. కానీ కొంతకాలంగా ఆ వెబ్‌సైట్‌ సేవలు స్తంభించాయి.  

► దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో మొబైల్‌ నంబర్‌ నమోదు చేసిన తర్వాత ఫోన్‌కు ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) రావడం లేదు. ఒక్క తుర్కయంజాల్‌లోనే  45 వేల మందికిపైగా ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఒక్కో మున్సిపాలిటీ నుంచి ఇలా వేల సంఖ్యలో  దరఖాస్తులు వచ్చాయి. 

► ఇప్పటికే రెండేళ్లు గడిచిపోవడం, ఎల్‌ఆర్‌ఎస్‌పై సందిగ్ధం నెలకొనడంతో చాలా మంది రసీదులు కోల్పోయారు. ప్రస్తుతం ఇళ్లు కట్టుకొనేందుకు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ రసీదు మాత్రం లభించడం లేదు. స్తంభించిన ఎల్‌ఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ సేవలను తిరిగి ఎప్పటి వరకు పునరుద్ధరిస్తారనే అంశంపై ఎలాంటి స్పష్టత లేకుండాపోయింది. (క్లిక్: హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అపార్ట్‌మెంట్లు.. మెయింటెనెన్స్‌ లేకుంటే ముప్పే!?)

వెల్లువలా దరఖాస్తులు.. 
కోవిడ్‌ ఉద్ధృతి తీవ్రత సమయంలో ప్రభుత్వం 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో తెలంగాణవ్యాప్తంగా వెల్లువలా వచ్చాయి. మొదటి రోజే 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా చివరి రోజుకు 1,81,847 మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో  మున్సిపాలిటీల నుంచే సుమారు 74 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీల నుంచి మరో 63 వేలకు పై గా అందాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ల నుంచి మరో 43,511 దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల రూపంలో ప్రభుత్వా నికి రూ.18.50 కోట్ల ఆదాయం లభించింది. (క్లిక్: దేశంలోనే తొలిసారిగా 5జీ డేటా కాల్‌ అభివృద్ధి)

మరిన్ని వార్తలు