పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప భూకంపం

24 Oct, 2021 04:08 IST|Sakshi

భూకంప తీవ్రత 4.0గా నమోదు.. భయాందోళనకు గురైన ప్రజలు 

జ్యోతినగర్‌(రామగుండం)/మంచిర్యాలటౌన్‌/మంచిర్యాలఅగ్రికల్చర్‌: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలకు ఇంట్లో ఉన్నవారు భయపడి బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ ఐదో డివిజన్‌ మల్కాపూర్, నర్రాశాలపల్లె, అన్నపూర్ణ కాలనీతోపాటు మేడిపల్లి ప్రాంతంలోని ఓపెన్‌కాస్ట్‌ గనిలో ప్రతిరోజు బొగ్గు వెలికితీయడానికి బాంబు పేలుళ్లు జరుగుతుంటాయి.

ఈ క్రమంలో శనివారం సంభవించిన భూ ప్రకంపనలను బాంబుపేలుళ్లు కావచ్చని చాలామంది భావించారు.  అయితే అది భూకంపమని తర్వాత తేలింది. భూకంప లేఖిని(రిక్టర్‌ స్కేల్‌)పై 4.0గా నమోదైనట్లు గుర్తించారు. మధ్యాహ్నం 2.03 గంటల ప్రాంతంలో కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

మంచిర్యాల జిల్లాలో.. 
జిల్లా కేంద్రమైన మంచిర్యాలతోపాటు నస్పూర్, శ్రీరాంపూర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో కుర్చీలు, టేబుళ్లు, బీరువాలు కదిలినట్లు అనిపించడంతో సిబ్బంది భయాందోళన చెందారు. శ్రీరాంపూర్, నస్పూర్‌ ప్రాంతాల్లోని ప్రజలు మొదట దీన్ని ఓసీపీ బ్లాస్టింగ్‌గా భావించారు. 2016 నవంబర్‌లో నస్పూర్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు పలువురు గుర్తు చేసుకున్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు. భూకంపం వచ్చిన ప్రాంతం

మరిన్ని వార్తలు