వసతులతో కొత్త వన్నెలు..

6 Feb, 2022 03:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి’ పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టడం, ఇందుకోసం రూ.7,289.54 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం కావడంతో సర్కారీస్కూళ్ల రూపురేఖలు మారతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ వర్గాలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి దశలో విద్యార్థుల హాజరు ఎక్కువ ఉన్న 9,123 స్కూళ్లను ఎంపిక చేసిన అధికారులు, వీటికి రూ.3,497 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వాస్తవానికి చాలా ప్రైవేటు స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్ల ల్లోనే విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలూ ఉన్నాయి. కానీ అవి ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. అనేక పాఠశాలల భవనాలు కూలి పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక మూత్ర శాలలు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు బల్లలు, టీచర్లకు కుర్చీలు వంటి సదుపాయాలు లేక ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. ఇవన్నీ సర్కారీ స్కూలు విద్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని గత ఏడాది ప్రభుత్వం జరిపిన సర్వేలోనే వెల్లడైంది. దీని ఆధారంగానే ఇప్పుడు ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

విద్యార్థులు పెరిగినా..
కరోనాతో పేద, మధ్య తరగతి వర్గాల ఆర్థిక స్థితి గ తులు చితికిపోవడం, ప్రైవేటు స్కూళ్లు ఫీజుల వసూళ్లకు అనుసరిస్తున్న వైఖరితో కొన్ని వర్గాలు ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లారు. దీంతో కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు దాదాపు 2.5 లక్షల వరకూ పెరిగాయి. రాష్ట్రంలో మొత్తం 26,072 ప్రభుత్వ పాఠశాలు ఉంటే, ఇందులో 22.93 లక్షల మంది విద్యార్థులున్నారు. చేరికలు పెరుగుతున్నా ఉన్న వనరులు, సదుపాయాలతోనే ప్రభుత్వ బడులు నెట్టుకురావాల్సి వస్తోంది. 

మోక్షం కలిగినట్టేనా?
డిజిటల్‌ విద్యకు, అలాగే స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యల వారీగా నిధులు ఖర్చు చేయనుండటంతో ఆయా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పథకానికి కొన్ని సవరణలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు దీనిపై పెదవి విరుస్తున్నారు. నిర్మాణ పనులకు గతంలో వేసిన అంచనాల ఆధారంగా నిధుల కేటాయింపు జరిగిందని, ప్రస్తుతం చాలా వస్తువుల ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతతో కూడిన నిర్మాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిధుల కొరత కారణంగా వంట గదులు చిన్నగా నిర్మించారు. దీంతో ఆయా గదుల్లో పెద్ద పాత్రలు కూడా పెట్టలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. వీటిని విశాలంగా నిర్మిస్తారా? ఉన్నవాటినే మెరుగుపరుస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన విషయం
ప్రభుత్వ స్కూళ్లల్లో మౌలిక వసతుల కల్పన ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన విషయం. అయితే పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టే చోట పెరిగే విద్యార్థుల సంఖ్యను పరిగణనలోనికి తీసుకోవాలి. వంటగదుల నిర్మాణం ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. విద్యార్థులకు వసతుల కల్పన మంచి ఫలితాలనిస్తుంది.    
– అరుణ శ్రీ, హెచ్‌ఎం నల్లగొండ

హంగులు పెంచితే అంతా సర్కారు బడికే 
వసతుల్లేక, బోధన సరిగా జరగడం లేదనే భావనతోనే తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లను ఇష్టపడుతున్నారు. నిజానికి అక్కడా ఇరుకు గదుల్లోనే బోధన సాగుతోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఎక్కువమంది ముందుకొస్తారు.  
 – కె గోపాల్‌ చక్రవర్తి, హేమచంద్రాపురం, భద్రాద్రి కొత్తగూడెం (విద్యార్థి తండ్రి) 

మరిన్ని వార్తలు