Batukamma: అలాంటి పిచ్చి డ్యాన్స్‌లు వద్దు.. గౌరమ్మ తల్లి గౌరవం కాపాడుదాం!

28 Sep, 2022 14:48 IST|Sakshi

ఎక్కడా లేనట్లుగా పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్నాం. ఎంతో విశిష్టత ఉన్న ఈ వేడుకల్లో తొమ్మిదిరోజులపాటు ఆడబిడ్డలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పొద్దున్నే లేచి తీరొక్క పూలను సేకరిస్తున్నారు. అందంగా బతుకమ్మలను పేర్చి సాయంత్రం అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతున్నారు. ఎంగిలిపూలతో మొదలైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పటి బతుకమ్మ ఆటాపాట తీరుపై పలువురు మహిళలు అసంతృప్తి వ్యక్తంజేస్తున్నారు. నాటి సంస్కృతి, సంప్రదాయాలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అప్పటి, ఇప్పటి బతుకమ్మ వేడుకల నిర్వహణపై పలువురు మహిళలు వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి  మాటల్లోనే..  
చదవండి: బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్‌

అప్పట్లోనే బాగా ఆడేవాళ్లం
కోటపల్లి: బతుకమ్మ పండుగత్తే మా చిన్నతనంలో ఎంతో సంబురపడేటోళ్లం. మాకన్న పెద్దోళ్లు ఆడుతుంటే వాళ్ల అడుగులో అడుగేసి వారి లెక్కే ఆడెటోళ్లం. నడుము వంచి చేతులతో చప్పట్లు కొడుతూ పాటలు పాడేవాళ్లం. ఇప్పటోళ్లకు డీజే పాటల మీద డ్యాన్సుల చేసుడు తప్ప చప్పట్లు కొడుతూ ఆడుడు తెల్వది. పాటలు పాడుతలేరు. చప్పట్లు కొడుతూ స్వయంగా పాడుతూ సంస్కృతిని కాపాడుకోవాలె. 
– కావిరి సుగుణ, రొయ్యలపల్లి, కోటపల్లి మండలం  

పెద్దవాళ్ల నుంచి నేర్చుకున్న..
చెన్నూర్‌: చిన్నప్పటి నుంచి అమ్మమ్మ,  అమ్మ బతుకమ్మ పాటలు పాడడం గమనించిన. నాకూ పాటలు అంటే ఇష్టం. ప్రతీ బతుకమ్మ పండుగకు పాటలు పాడడం చెప్పలేనంత సంతోషాన్నిస్తోంది. పండుగ వచ్చిందంటే కొత్తకొత్త పాటలు నేర్చుకొని తొమ్మిది రోజులు పాడేదాన్ని. బతుకమ్మ అంటేనే చప్పట్లు కొడుతూ పాడుతూ 
ఆడేది. బతుకమ్మ ఆటను అప్పట్లాగే ఆడితేనే బాగుంటది. 
– మదాసు శృతి, చెన్నూర్‌ 

పిచ్చి పాటలు.. పిచ్చి డ్యాన్స్‌లు.. 
కాసిపేట: ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా అప్పట్లో ఎంతో సంబురంగా చప్పట్లు కొడుతూ స్వయంగా పాటలు పాడెటోళ్లం. 40 ఏళ్లుగా మా ఊళ్లో నేను పాటలు పాడుతుంటే మిగతావాళ్లు పాడేది. ప్రస్తుతం ఏడ జూసినా సౌండ్‌ బాక్స్‌లు, డీజేలల్ల పిచ్చి పాటలు పెట్టి పిచ్చి డ్యాన్స్‌లు చేస్తున్నరు. ఇది మన సంస్కృతి కాదని అందరూ తెలుసుకుంటే మంచిది.
– సాయిని మల్లక్క, కోమటిచేను, కాసిపేట మండలం

పాటలు పాడుతూ ఆడుతాం
చెన్నూర్‌రూరల్‌: నేను బతుకమ్మ పాటలు పుస్తకంలో చూసి నేర్చుకొన్న. నా చిన్నతనం నుంచి బతుకమ్మ వద్ద పాటలు పాడుతున్న. మా వాడకు బతుకమ్మ ఆడేటప్పుడు చప్పట్లు కొడుతూ స్వయంగా పాడుతున్నం. ఊళ్లో చాలాచోట గిట్లనే ఆడుతున్నరు. నాకు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టం. చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడి మన సంస్కృతిని కాపాడుకోవాలె.
  – గద్దె శ్రీలత, పొక్కూరు, చెన్నూర్‌ 

డీజే సౌండ్‌లు తప్ప చప్పట్లు లేవు
కాసిపేట: బతుకమ్మ వేడుకలు మొదలైనయంటే తొమ్మిది రోజులు ఊళ్లో పండుగ వాతావరణం కనిపించేది. ఒకరు పాటందుకుంటే మిగతా వాళ్లు అనుకరించెటోళ్లు. సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆనందంగా ఆడుకునెటోళ్లం. ఇప్పుడు డీజే సౌండ్‌లు, డ్యాన్స్‌లు తప్పా చప్పట్లు వినిపించడంలేదు. యువత పూర్వం నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వాలె.  
– బూసి రాజేశ్వరి, సోమగూడం, కాసిపేట మండలం 

ఇప్పుడు పాడెటోళ్లే లేరు
లక్సెట్టిపేట: చిన్నప్పుడు బతుకమ్మ పాటలు పాడుతూ సంబురంగా బతుకమ్మ పండుగను జరుపుకొనేటోళ్లం. బతుకమ్మ వచ్చిందంటే చాలు సంబురంగా పాటలు పాడేదాన్ని. ఇప్పుడు పాటలు పాడేవాళ్లే లేరు. డీజే పాటలు పెట్టుకుని ఆడుతున్నరు. రోజురోజుకూ ఆట తీరే మారుతున్నది. బాధనిపిస్తుంది. సంప్రాదాయాన్ని కాపాడుకోవాలె. పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుకోవాలె. 
– లింగాల దేవక్క, గంపలపల్లి, లక్సెట్టిపేట మండలం 

ఎంతో ఇష్టపడి పాటలు పాడుతా
భీమారం: బతుకమ్మ పండుగ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రతీ సంవత్సరం  పండుగ వచ్చిందంటే చాలు ఉదయాన్నే మాఇంట్లో లేని పూలను ఇంటింటికీ వెళ్లి సేకరించి బతుకమ్మను పేరుస్తా. డీజే పాటలు పెట్టినా నన్నే పాడుమంటరు. నేను పాడితే మిగతావాళ్లు సంబురంగా పాడుతున్నరు. మా ఊళ్లో ఎంతో ఇష్టంగా తొమ్మిదిరోజుల పాటు సంబురాలు జరుపుకొంటున్నం.
– ఎల్కటూరి శంకరమ్మ, భీమారం మండలం 

ఇప్పటోళ్లకు ఆడుడే రాదు
జన్నారం: నాడు సాయంత్రం బతుకమ్మ ఆట మొదలువెట్టి గంటలతరబడి ఆడుకునేది. వాడోళ్లందరం చప్పట్లు కొడుతూ పాటలు పాడెటోళ్లం. ఎంతో భక్తిశ్రద్ధలతో తొమ్మిదిరోజులు పండుగ జరుపుకొనేది. ఇప్పుడు ఎక్కడ చూసినా డీజే పాటలు పెట్టుకుని ఎగురుతున్నరు. బతుకమ్మల చుట్టూ కోలలాడుతున్నరు. బతుకమ్మ ఆటనే మార్చిండ్రు. ఇప్పటోళ్లకు ఎగురుడు తప్ప ఆడుడు రాదు.  
– అమరగొండ లక్ష్మి, జన్నారం మండలం  

మా అప్పుడు డీజేల లొల్లి లేదు
లక్ష్మణచాంద: అప్పట్లో మేం బతుకమ్మ ఆడేటప్పుడు గీ డీజేల లొల్లి లేదు. అచ్చమైన బతుకమ్మ పాటలు పాడెటోళ్లం. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పుట్లు కొడుతూ ఒకరు ముందు పాడితే వెనుక అందరం పాడేది. ‘రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..’ అంటూ రాగమెత్తితే ఆ జోష్‌ వేరేలా ఉండేది. ఇప్పటోళ్లకు అప్పటిలెక్క ఆడుడే రాదు. తెల్వనోళ్లు నేర్చుకుని ఆడాలె.  
– ఎంకవ్వ, లక్ష్మణచాంద 

సంప్రదాయాలను కాపాడుకోవాలె
భీమిని: పూర్వపు సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపైన ఉంది. పూలను దేవతగా పూజించే పండుగ మరెక్కడా లేదు. సంప్రదాయం ప్రకారం బతుకమ్మ ఆడాలి. నాడు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆడుకునేవాళ్లం. నేడు డీజే సౌండ్‌ల మధ్య జరుపుతున్నారు. ఆనాటి సంప్రదాయాలను కాపాడుకోవాలె.
– పుల్లూరి సురేఖ, కన్నెపల్లి, భీమిని మండలం  

అప్పటి ఆట పిల్లలకు నేర్పిస్తున్న
భైంసాటౌన్‌: నేటి తరం పిల్లల కు మన అప్పటి బతుకమ్మ ఆట గురించి తెలియదు. పిల్లలకు వివరించేందుకు తల్లిదండ్రులకూ సమయం ఉండడం లేదు. నేను భరత నాట్యం నేర్చుకుని ఇప్పటి పిల్లలకు నేర్పుతున్న. బతుకమ్మ పండుగ అంటే డీజే పెట్టుకుని డ్యాన్సులు చేయడం కాదని వారికి వివరిస్తున్న. దీంతో వారిలో మార్పు వస్తోంది. కొందరైనా నన్ను అనుసరించడం సంతోషంగా ఉంది.
 – రంగు సౌమ్య, నృత్య శిక్షకురాలు, భైంసా 

మరిన్ని వార్తలు