టీకా కేటాయింపుల్లో తెలంగాణకు ప్రాధాన్యత తగ్గే అవకాశాలు..!

9 Jun, 2021 13:44 IST|Sakshi

వ్యాక్సిన్‌ పంపిణీపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు 

పాజిటివిటీ రేటు ఆధారంగా ప్రాధాన్యత 

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అతి తక్కువ వ్యాప్తి 

సాక్షి, హైదరాబాద్‌:  టీకా కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ పంపిణీకి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ మేరకు సవరించిన మార్గదర్శకాలను మంగళవారం జారీ చేసింది. నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల జనాభా, పాజిటివ్‌ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ల వృథా వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిపింది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ముందుగా వ్యాక్సినేషన్‌ చేయించే ఆలోచన కనిపిస్తోంది. 

రాష్ట్రంలో పాజిటివిటీ 1.5% కంటే తక్కువే 
ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాప్తి అత్యంత తక్కువగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీగా చేస్తున్న పరీక్షలను బట్టి చూస్తే పాజిటివిటీ రేటు 1.5 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ ప్రకటిస్తోంది. అంటే కొన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి తీవ్రత తక్కువగా ఉంది. ఇది వ్యాక్సిన్‌ కేటాయింపులపై ప్రభావం చూపించే అవకాశం ఉందని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఒక్కరోజులో 1.66 లక్షల టీకాల పంపిణీ 
రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల వరకు మొత్తం 69,36,590 టీకాలు పంపిణీ చేశారు. ఇక సోమవారం ఒక్కరోజు 1,66,818 మందికి టీకాలు ఇవ్వగా.. మొదటి డోసు 1,54,208, రెండో,డోసు 12,610 మంది ఉన్నారు. వీరిలో హైరిస్క్‌ కేటగిరీకి చెందిన వారు 1,28,460 మంది ఉన్నట్లు వైద్య శాఖ వివరించింది.

చదవండి: Coronavirus: ‘ఐరిస్‌’తో వ్యాపిస్తుందా?

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు