Telangana: మరో పది రోజులు లాక్‌డౌన్‌?

30 May, 2021 03:10 IST|Sakshi

నేటి కేబినెట్‌ భేటీలో నిర్ణయం 

సడలింపు వేళలు పెంచే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపు, ఇతర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 30తో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ ముగియనుండగా, ఆ తర్వాత పొడిగించాలా.. వద్దా అన్న విషయంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో గడిచిన కొద్ది రోజుల నుంచి కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినా, ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే మళ్ళీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో మరో వారం, లేదా 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే, కొన్ని విషయాల్లో కొత్తగా సడలింపులు ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల వరకు పొడిగించాలని వ్యాపార వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ దిశగా మంత్రివర్గం నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం, ధాన్యం సేకరణ, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం అంశాలపై సైతం కేబినెట్‌ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.  

మరిన్ని వార్తలు