ఆదమరిస్తే అంతే!

15 Apr, 2021 01:29 IST|Sakshi

మరో మహారాష్ట్ర అయ్యే ప్రమాదం: డీఎంహెచ్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు

కుటుంబ సభ్యులకు వ్యాపించకుండా ఇంట్లోనూ మాస్క్‌ తప్పనిసరి

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోందని హెచ్చరిక

మరో 4 నుంచి 6 వారాలు ఇదే తీవ్రత

సాక్షి, హైదరాబాద్‌: ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ధరించాలని చెబుతూ వచ్చామని, ఇక నుంచి ఇంట్లోనూ పెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన వీడియో క్లిప్‌ను మీడియాకు విడుదల చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా సరే మాస్క్‌ ధరించాలని కోరారు. ‘బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక మాస్క్‌ వేసుకోకపోవడం వల్ల మీ ద్వారా ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులకు సోకే ప్రమాదం ఉంటుంది. తద్వారా వారు ఆసుపత్రులపాలై ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని’ఆయన హెచ్చరించారు. ఇళ్లు ఇరుకుగా ఉంటే వైరస్‌ మరింత వేగంగా విస్తరిస్తుందన్నారు. వైరస్‌ ఇప్పుడు గాలి ద్వారా వ్యాపించే పరిస్థితులు దాపురించాయని, ఇదేమీ తాను అతిశయోక్తిగా చెప్పడం లేదన్నారు. కాబట్టి ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే మహారాష్ట్ర పరిస్థితులు..
గత నాలుగు వారాలుగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని డాక్టర్‌ శ్రీనివాస రావు పేర్కొన్నారు. రాబోయే నాలుగు నుంచి ఆరు వారాల్లో ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇలాగే వదిలేస్తే (ప్రజలు తేలికగా తీసుకుంటే) తెలంగాణ కూడా మహారాష్ట్ర మాదిరిగా తయారవుతుందని ఆయన హెచ్చరించారు. కేసులు పెరుగుతున్నందున అనేక ఆసుపత్రుల్లో ఇప్పటికే పడకలు దొరక్క కొందరు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని పడకలు ఏర్పాటు చేసినా పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆసుపత్రుల్లో బెడ్స్‌ దొరకని పరిస్థితి వస్తుందన్నారు.

ప్రభుత్వం కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వైపు వెళ్లడం లేదంటే.. అంతా బాగుందని అర్థం కాదన్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల జీవనోపాధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బతినొద్దని భావించి ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకోవడం లేదని ఆయన వివరించారు. అలాగే ఇతరత్రా ఆంక్షలు పెట్టాలనుకోవడం లేదన్నారు. స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత విషమించే అవకాశం ఉందన్నారు. ఇప్పుడున్న వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తోందని, ఇంట్లో ఎవరికైనా ఒకరికి వస్తే, కొన్ని గంటల్లోనో లేదా ఒకట్రెండు రోజుల్లోనే అందరికీ సోకుతోందన్నారు. ప్రజారోగ్య వ్యవస్థ సిబ్బంది కూడా లక్షలాది మందిని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు.

చదవండి: ‘కేసీఆర్‌, జానారెడ్డిలు తోడుదొంగలే..’

మరిన్ని వార్తలు