ఒక్కో కాలేజీకి.. 20 ఎకరాలు!

1 Sep, 2021 02:54 IST|Sakshi

చకచకా కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు

రెండు నెలల్లో పరికరాలు అందుబాటులోకి.. టెండర్లు ఆహ్వానించిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ

ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాల్లో హాస్టళ్లు 

వచ్చే ఏడాది తరగతులు ప్రారంభించేలా కసరత్తు.. పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏడు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు దిశగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వేగం పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభ మయ్యేలా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్‌ కర్నూలు, కొత్తగూడెం, మంచిర్యాలలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు రెండు నెలల్లో వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని సమకూర్చాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది అక్టోబర్‌ 31 నాటికి వైద్య పరికరాలు, సామగ్రిని అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలం గాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ) ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. అలాగే విద్యార్థులకు హాస్టళ్ల వసతిని అద్దె భవనాల్లో కల్పించాలని నిర్ణ యించారు. దీని కోసం ఆ కాలేజీలకు సమీపంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాలను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్లు కూడా ఆ పనిలో నిమగ్నమయినట్లు అధికారులు తెలిపారు. 

టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అసంతృప్తి...
రాష్ట్రంలో ఒకేసారి ఏడు కాలేజీలు, 1,050 సీట్లు పెరగడం ఇదే తొలిసారి. కొత్త కాలేజీ భవనాలను నిర్మించే బాధ్యత రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. వాస్తవంగా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఉన్నా, దాని సామర్థ్యం ఆ మేరకు లేకపోవడంతో ఆర్‌అండ్‌బీకి అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో అసంతృప్తి నెలకొంది. కాగా, ఒక్కో కాలేజీ కోసం 20 ఎకరాలు అవసరమని నిర్ధారించారు. అందుకోసం భూ సేకరణ జరుగుతోంది. జగిత్యాలలో గోదాముల స్థలాన్ని తీసుకోవాలని నిర్ణయించి, ఫైలు ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. తొలి ఏడాది తరగతుల ప్రారంభానికి ముందే జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తనిఖీలు చేస్తుంది. కాబట్టి ఆ తనిఖీల నాటికి లెక్చరర్‌ హాళ్లు, లైబ్రరీ, డెమో రూములు, పరిపాలనా కార్యాలయం తదితరాలను సమకూర్చాలి. 

అదనపు పడకల ఏర్పాటుపై దృష్టి...
ఇక మెడికల్‌ కాలేజీలకు అనుబంధ ఆసుపత్రులను స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేస్తారు. అయితే ప్రతీ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉండే ఆసుపత్రికి తప్పనిసరిగా 330 పడకలు ఉండాలి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలోనే 400 పడకలు ఉన్నాయి. కాబట్టి అక్కడ పడకల సమస్య లేదు. వనపర్తి, జగిత్యాల ఆసుపత్రుల్లో 150 పడకల చొప్పున, మహబూబాబాద్‌లో 170, నాగర్‌కర్నూలులో 120, కొత్తగూడెంలో 100, మంచిర్యాలలో 200 మాత్రమే ఉన్నాయి. వీటన్నింటిలో అదనంగా పడకలను నెలకొల్పాల్సి ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వాటిల్లో ఈ ఏడాది నవంబర్‌ 30 నాటికి పడకల ఏర్పాటు పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేశారు. ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు. అందుకు సంబంధించిన ఆదేశాలను జారీచేసేందుకు ఆర్థికశాఖకు ఫైలు వెళ్లినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇక కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతి కోసం దరఖాస్తు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.  
 

 • ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు 9
 • కొత్తగా వచ్చే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు 7
 • మొత్తం ప్రభుత్వ కాలేజీల సంఖ్య  16
 • వీటిల్లోని ఎంబీబీఎస్‌ సీట్లు1,640
 • వీటిల్లో 150 చొప్పున అందుబాటులోకి వచ్చే ఎంబీబీఎస్‌ సీట్లు 1,050
 • మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య :  2,690

ఒక్కో ఆసుపత్రికి సిబ్బంది ఇలా...

 • కావాల్సిన ప్రొఫెసర్ల సంఖ్య 6
 • అసోసియేట్‌ ప్రొఫెసర్ల సంఖ్య 17
 • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సంఖ్య  31
 • 7 మెడికల్‌ కాలేజీలకు కావాల్సిన వారు 377
 • పలుచోట్ల నుంచి సరెండర్‌ ద్వారా సమకూరినవారు 115 
 • కాంట్రాక్టు పద్ధతిన నియమించు కోనున్నవారు 262 
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు