పది రోజుల్లో వైద్య పోస్టుల నోటిఫికేషన్‌!

7 May, 2022 04:13 IST|Sakshi

రాత పరీక్షలకు సిలబస్‌ తయారీలో కమిటీలు నిమగ్నం 

స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రాత పరీక్ష 

30 రకాల టెక్నీషియన్లకు వేర్వేరుగా సిలబస్‌ రూపకల్పనపై దృష్టి 

మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: వైద్యపోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. రాత పరీక్ష ఉన్న స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్, ఏఎన్‌ఎం పోస్టులసిలబస్‌ తయారీ వేగంగా జరుగుతోంది. ఇందుకోసం వైద్య, నర్సింగ్‌ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సిలబస్‌ కొంత కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.  డాక్టర్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌ మాత్రమే ఉంటుంది కాబట్టి సిలబస్‌ అవసరం లేదు.  పోస్టింగ్‌పై∙ఆప్షన్లు అడుగుతారు. ఆ ప్రకారమే వారికి పోస్టింగు లు ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎం పోస్టుల కోసం సిలబస్‌ తయారీ పూర్తయ్యాక వారం పది రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  

సిలబస్‌ తయారీలో సవాళ్లు.. 
రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తారు. వాటిల్లో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం పోస్టుల వంటి 10 వేలకు పైగా పోస్టులను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) భర్తీ చేస్తుంది. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను మాత్రం టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. అయితే వీటికి సంబంధించిన సిలబస్‌ను మాత్రం సంబంధిత వైద్య వర్గాలే తయారు చేస్తున్నాయి.

కాగా ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు సంబంధించిన సిలబస్‌ తయారీ సవాల్‌గా మారింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తయారు చేసిన సర్వీస్‌ రూల్స్‌ను మార్చడం కీలకాంశంగా మారింది. ఈ కాలంలో వైద్య రంగం కొత్త పుంతలు తొక్కింది. అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ల్యాబ్‌ టెక్నీషియన్లలో దాదాపు 30 రకాల విభాగాలు, కోర్సులు వచ్చాయి. కార్డియో టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, న్యూరోకు సం బంధించి టెక్నీషియన్‌ ఇలా వివిధ కొత్త యం త్రాలకు సం బంధిత టెక్నీషియన్లు వచ్చారు. వాటికి కోర్సులు కూడా వచ్చాయి. ఇలా 30 రకాల కోర్సు లు చేసిన వారందరూ అర్హులు కాబట్టి వేర్వేరు కోర్సులకు వేర్వేరు సిలబస్‌ తయారు చేయాల్సి ఉంటుంది. 

పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు 
వైద్యశాఖలో పోస్టులను ప్రకటించిన తర్వాత స్టాఫ్‌ నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్, ఏఎన్‌ఎం పోస్టుల కోసం అభ్యర్థులు పెద్దసంఖ్యలో సిద్ధమవుతున్నా రు. తాము చదివిన పుస్తకాలను మరోసారి తిరగేస్తున్నారు. మార్కెట్లో ఉన్న పోటీ పరీక్షలపుస్తకాలను కూడా కొనుగోలు చేసి చదువుతున్నారు.  ఐదేళ్ల తర్వాత పరీక్షలు జరగనున్న 4,722 స్టాఫ్‌ నర్సు పోస్టుల కోసం 20 వేలమంది పోటీ పడే అవకాశముందని భావిస్తున్నారు. 1,520 ఏఎన్‌ఎం పోస్టుల కోసం 6 వేలమంది, 2 రెండు వేల వరకున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 8 వేల మంది పోటీ పడతారని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.    

మరిన్ని వార్తలు