వేగంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు

4 Dec, 2022 01:10 IST|Sakshi

38.06 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ 

6,734 కొనుగోలు కేంద్రాలకుగాను 729 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి 

మంత్రి గంగుల కమలాకర్‌ ఉన్నతస్థాయి సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం ఆయన జిల్లాల వారీగా కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్, డిప్యూటీ కమిషనర్‌ రుక్మిణిలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ)ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు.

గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామన్నారు. గత సీజన్లో నవంబర్‌ ఆఖరు నాటికి 25.84 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలు, అన్ని ప్రాంతాలకు అందుతున్న పుష్కలమైన నీటితో ఈసారి ధాన్యం నాణ్యత మరింత పెరిగిందని చెప్పారు. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. బహిరంగ మార్కెట్‌లో సైతం కనీస మద్దతు ధర కన్నా అధిక ధరతో రైతులు ధాన్యాన్ని విక్రయిస్తుండటం శుభపరిణామమన్నారు. కోతలకు అనుగుణంగా ధాన్యం సేకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 

729 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి 
రాష్ట్రంలో 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 38.06 ఎల్‌ఎంటీ ధాన్యంలో 36.87 ఎల్‌ఎంటీని మిల్లులకు తరలించినట్లు గంగుల తెలిపారు. దీని విలువ రూ.7,837 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లోకి ఇప్పటివరకు 4,780 కోట్లు జమచేసినట్లు చెప్పారు. ధాన్యం సేకరణకు 9.52 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించగా, ఇంకా 9.16 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగోళ్లు పూర్తయిన 729 కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు.  

నిజామాబాద్‌ టాప్‌ 
వానాకాలానికి సంబంధించిన ధాన్యం సేకరణలో రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా ఇప్పటివరకు ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38,06,469 మె ట్రిక్‌ టన్నుల సేకరణ పూర్తికాగా నిజామా బాద్‌ జిల్లాలో 5,38,354 మెట్రిక్‌ టన్నుల సేకరణ అయింది. తరువాత కామారెడ్డి జిల్లాలో 3,98,818 మెట్రిక్‌ టన్నులు, నల్లగొండ జిల్లాలో 3,22,634 మెట్రిక్‌ టన్నులు, మెదక్‌ జిల్లాలో 3,22,047 మెట్రిక్‌ టన్నుల సేకరణ పూర్తయింది.  

సన్నాలకు డిమాండ్‌తో... 
జై శ్రీరాం, బీపీటీ, హెచ్‌ఎంటీ లాంటి సన్న రకం వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉండటంతో మిల్లర్లు, వ్యాపారులు సన్నధాన్యాన్ని వివిధ జిల్లాలతోపాటు నిజామాబాద్‌ జిల్లాలో భారీగా సేకరించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాపారులు నిజామాబాద్‌ జిల్లాలో సన్న రకం ధాన్యాన్ని పెద్దఎత్తున సేకరించారు. రైతులకు క్వింటాకు రూ.100 ఎక్కువగా చెల్లించి మరీ సేకరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. దీంతో దొడ్డు రకం ధాన్యమే కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా వస్తోంది. 

మరిన్ని వార్తలు