సిద్దిపేట వస్తే వాస్తవాలు చూపిస్తా..

14 May, 2022 01:44 IST|Sakshi
గజ్వేల్‌లో పర్యటించిన సందర్భంగా మట్టి కుండలు తయారు చేసే సారెను తిప్పుతున్న మంత్రి హరీశ్‌రావు. 

కాళేశ్వరంపై మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు పారలేదని తొండి మాటలు మాట్లాడే బీజేపీ నేతలు గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే వాస్తవాలు చూపిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్‌ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, మర్కుక్, గజ్వేల్, కొండపాక మండలాల్లో రూ.33.95 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ రోజాశర్మలతో కలసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయా సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తమ ఉనికిని కోల్పోతామన్న భయంతోనే బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరువునేల పరవశించేలా చేశామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో 99 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండితే, ఆ తర్వాత 2 కోట్ల 59 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో కరెంటు కోసం ఎదురు చూపులు ఉండేవని, వ్యవసాయ రంగం జవసత్వాలను కోల్పోయిందని ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికీ స్వచ్ఛ మైన నల్లా నీటిని అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. వ్యవసాయ రంగంలో తీసు కుంటున్న నిర్ణయాల వల్ల ఉత్పాదకత పెరిగిందన్నారు. పామాయిల్‌ తోటలసాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఈసారి బడ్జెట్‌లో వీటికి రూ.వెయ్యి కోట్లను కేటాయించినట్లు చెప్పారు. రైతులు పామాయిల్‌ తోటల సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు.

మరిన్ని వార్తలు