ఈటల గెలిస్తే లాభమేంటి?

9 Aug, 2021 02:40 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

‘దళితబంధు’ను ఆపేందుకు కుట్ర చేస్తున్నారు: హరీశ్‌

అందుకే ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం కేంద్రంపై బీజేపీ ఒత్తిడి

సిద్దిపేటజోన్‌: హుజూరాబాద్‌లో బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుగుతుందని, పెట్రోల్, డీజిల్‌ గ్యాస్‌ ధరలను పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ గెలిస్తే ప్రజలకు వచ్చే లాభం ఏమిటని, ఆయన గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి ఏమీ ఉండదన్నారు. వ్యక్తి ప్రయోజనమా.. హుజూరాబాద్‌ ప్రజల ప్రయోజనమా అనే అంశంపై చర్చ పెట్టాలని సోషల్‌ మీడియా వారియర్స్‌కు ఆయన సూచించారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వారియర్స్‌తో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. నాడు హుజూరాబాద్‌లో రైతుబంధును ప్రారంభిస్తే చప్పట్లు కొట్టిన ఈటల, నేడు అక్కడే దళితబంధు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తే గుండెలు బాదుకొని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.

దళిత బంధును ఆపేందుకు బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని, అందుకే తొందరగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి ఒత్తిడి తెస్తున్నారన్నారు. దళితబంధు హుజూరాబాద్‌ ప్రజలకు ఇవ్వద్దంటారా? దీనిపై బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దళితబంధు పథకం ఎన్నికల కోసం అంటున్నారని, మార్చి నెలలోనే బడ్జెట్‌లో దళితుల అభ్యున్నతికి రూ.1,200 కోట్లతో దళిత ఎంపవర్‌మెంట్‌ స్కీంను అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, కౌశిక్‌ రెడ్డి, వివిధ జిల్లాల టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు