వైద్య సేవల్లో తెలంగాణ టాప్‌-3లో ఉంది.. ప్రభుత్వ ఆసుప్రతుల్లో 55 శాతం సాధారణ ప్రసవాలు

6 Aug, 2022 08:03 IST|Sakshi

దూద్‌బౌలి: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి పరిచామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మిల్క్‌ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ తల్లిపాలు లభించని వారికి మిల్క్‌ బ్యాంకులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుప్రతుల్లో 55 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం 20 శాతం సాధారణ ప్రసవాలు, 80 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్య సేవలను అందించడంలో దేశంలో మూడో స్థానంలో ఉందని చెప్పారు.

పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు అందిస్తున్న సేవలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాప పుట్టిన అనంతరం కొందరు కిందిస్థాయి సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఓ పాప తల్లి ఫిర్యాదు చేయగా... అలాంటివి జరగకుండా చూసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చుపెడతామన్నారు. 

ఏ సమస్యలున్నా..డీఎంఈ ద్వారా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హరీష్‌రావు హమీ ఇచ్చారు. ఓపీ, ఇతర వార్డుల్లో తిరిగి ఆసుపత్రిలో అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పేట్లబురుజు ఆసుపత్రిలోని మహిళలకు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి పసుపు బొట్టు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్‌ కె.రమేశ్‌ రెడ్డి, పేట్లబురుజు ఆసుప్రతి సూపరింటెండెంట్‌ పి.మాలతి, ఆర్‌ఎంఓ సి.పి.జైన్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: నిజామాబాద్‌లో హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌! 

మరిన్ని వార్తలు