వైద్య పరీక్షలకు ప్రైవేటుకెందుకు?

25 May, 2022 01:32 IST|Sakshi

ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించుకోవాలి: మంత్రి హరీశ్‌రావు 

ప్రతి జిల్లా ఆస్పత్రిలో టీడయాగ్నొస్టిక్‌ హబ్, రేడియాలజీ ల్యాబ్‌ 

సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్‌ ప్రారంభం 

సాక్షి, సిద్దిపేట: గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షల కోసం వెళ్తే ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పంపేవారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రికి కానీ, స్కానింగ్‌ సెంటర్లకు కానీ వెళ్లొద్దని.. ఏ వైద్య పరీక్ష కావాలన్నా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని చెప్పారు. మంగళవారం సిద్దిపేటలోని జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. పట్టణ శివారులో ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పీహెచ్‌సీ నుంచి వచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేందుకు టీ డయాగ్నొస్టిక్‌ హబ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

పీహెచ్‌సీలకు గుండెనొప్పితో వచ్చేవారి కోసం ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్‌ తదితర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియాలజీ ల్యాబ్‌లు, హైదరాబాద్‌ జంట నగరాలలో అదనంగా మరో 10 ల్యాబ్‌లు ప్రారంభిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. అన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులలో రూ.40 వేల విలువ గల ఇంజెక్షన్‌ ఉచితంగా ఇస్తూ.. ప్రమాదకరమైన గుండెపోటు (స్టెమీ) రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. అన్నీ జిల్లాల్లో ఈ ‘స్టెమీ’కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. 

33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు 
సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు 70 ఏళ్లలో కేవలం 3 కళాశాలలు వస్తే, ఇవాళ ఏడేళ్లలో 33 మెడికల్‌ కళాశాలలు తెచ్చుకున్నామన్నారు. దేశంలోనే ప్రతి జిల్లాలో మెడికల్‌ కళాశాల పెట్టిన ఏకైక రాష్ట్రం  తెలంగాణ మాత్రమేనని చెప్పారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. గతంలో ఎంబీబీఎస్‌ సీట్లు 700 మాత్రమే ఉండేవని, ఇప్పుడు 2,840 సీట్లు పెరిగాయని తెలిపారు. రాబోయే రోజుల్లో 5,240 సీట్ల పెంపునకు కృషి చేస్తామన్నారు. 

మా తండ్రివయ్యా హరీశ్‌రావు 
స్థానిక ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో మంత్రి హరీశ్‌రావు పలువురికి సొంత ఖర్చుతో  కంటి ఆపరేషన్లు చేయించారు. ఆపరేషన్‌ చేయించుకున్న విఠలాపూర్‌ గ్రామానికి చెందిన వృద్ధురాలు బాలవ్వ  వద్దకు వెళ్లిన మంత్రి.. ‘అవ్వా నేనెవరినీ..?’ అం టూ ప్రశ్నించారు. దానికి ఆమె ‘మా తండ్రివయ్యా హరీశ్‌రావు నువ్వు..’అంటూ బదులిచ్చింది. కాగా ‘నీకు మంచిగ చూశారా, ఇక నుంచి నీకు కండ్లు మంచిగ కనపడతాయి, మీ ఊరు నుంచే కంటి పరీక్షలు మొదలు పెట్టాం..’అని మంత్రి చెప్పారు.  

మరిన్ని వార్తలు