TS: ఆరోగ్యశ్రీ సేవలు పెంచండి..

15 Sep, 2022 02:55 IST|Sakshi
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రులు హరీశ్, తలసాని 

ప్రజల నమ్మకం వమ్ముకాకుండా చూడండి 

వైద్యాధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌/లక్డీకాపూల్‌: నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్, ఇతర ప్రభుత్వాస్పత్రులకు ప్రజలెంతో నమ్మకంతో వస్తున్నారని, అందుకనుగుణంగా  నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ ఓపీ, ఐపీ సేవలు, అవయవ మార్పిడి సర్జరీలు పెంచాలని ఆదేశించారు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో బుధవారం వైద్యశాఖపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. నిమ్స్‌లో 200 పడకలతో ఎంసీహెచ్‌ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంఎన్‌జే ఆసుపత్రిలో కొత్తగా నిర్మిస్తున్న భవనం అందుబాటులోకి వస్తే పడకల సంఖ్య 450 నుంచి 750కి పెరుగుతుందన్నారు.  

నిమ్స్‌ అధికారులకు మంత్రి క్లాస్‌ 
నిమ్స్‌ ఆస్పత్రి నిర్వహణలో అధికారులు అవలంభిస్తున్న వైఖరిపై హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజలు ఇక్కడి వైద్యంపై ఎన్నో ఆశలతో వస్తున్నారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ముచేసేలా అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. నిమ్స్‌ డైరెక్టర్‌ ఎక్కువ సమయం ఆస్పత్రిలో ఉండాలని, మెడికల్‌ సూపరింటెండెంట్‌ రోజూ ఎమర్జెన్సీ వార్డును సందర్శించి, పడకల నిర్వహణ సరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. 

ధర పెంపుతో పాల సేకరణ పెరిగింది 
పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖల పురోగతిపై ఆ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మరో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. షీప్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌యాదవ్, ఆర్ధికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్, పశుసంవర్ధకశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ఆధర్‌సిన్హా, డైరెక్టర్‌ రాంచందర్, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరామ్‌ భూక్యా, మంజువాణి పాల్గొన్న ఈ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ విజయ డెయిరీ సేకరిస్తున్న పాల ధరను ఇటీవల పెంచడంతో, అదనంగా మరో 30 వేల లీటర్ల పాల సేకరణ పెరిగిందన్నారు. 5 లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో మెగా డెయిరీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.  

మరిన్ని వార్తలు