సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

4 Jun, 2022 04:08 IST|Sakshi

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సమీపిస్తున్న నేపథ్యం లో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఈ మేరకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ ఎంలతో నెల వారీ సమీక్షను మంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల మందులను సరఫరా చేస్తుంది కాబట్టి ఎక్కడా మందులు లేవనే మాట రావొద్దని స్పష్టం చేశారు. ఈ– ఔషధి ద్వారానే అన్ని రకాల మందుల పంపిణీ జరగాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను ఈ నెల చివరికల్లా వంద శాతం పూర్తి చేయాలన్నారు. రోగ నిర్ధారణ అయిన వారికి అవసరమైన మం దుల కిట్లను వెంటనే అందజేయాలని సూచించారు.

పీహెచ్‌సీలు, ప్రభుత్వా సుపత్రుల్లో డెలివరీలు పెరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని, సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలని చెప్పారు. ఎనీమియా ఉన్న గర్భి ణులను గుర్తించి క్రమం తప్పకుండా మందులు అందించాలని ఆదేశించారు. పుట్టిన బిడ్డలకు మొదటి గంటలోనే తల్లి పాలు అందేలా చూడాలన్నారు. గర్భిణులను ప్రసవాలు, తనిఖీల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకొస్తున్న ఆశ కార్యకర్తల కోసం ప్రత్యేక గది, కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఉన్నతాధికారులు జిల్లాల పర్యటన చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు