కొత్త కళ్ల జోడుతో సరికొత్త వెలుగులు

16 Aug, 2022 02:30 IST|Sakshi
వృద్ధురాలి కంటి అద్దాలు సరిచేస్తున్న మంత్రి హరీశ్‌రావు 

మంత్రి హరీశ్‌రావుతో వృద్ధుల ముచ్చట్లు

కంటి అద్దాలు పంపిణీ చేసిన మంత్రి 

సిద్దిపేటజోన్‌: కొత్త కళ్ల జోడు.. కళ్లలో కొత్త వెలుగులు నింపుతుందని, ప్రభుత్వం తరఫున గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి సమస్యలు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. సోమవారం స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ చేశారు.

‘‘మీ చల్లని చూపుతో మా కంటికి కొత్త వెలుగులు వచ్చాయని, ఇప్పుడు అన్ని బాగా చూడగలుగుతున్నాం. బిడ్డా... నీవు సల్లంగా ఉండాలి’’అని మంత్రిని ఈ సందర్భంగా వృద్ధులు ఆశీర్వదించారు. దశాబ్దాలుగా కంటి సమస్యలతో బాధపడుతున్న పేదవారికి కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేసి మందులు ఇవ్వడం సంతృప్తినిచ్చిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 762 మందికి కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. మరో 1,800మందికి చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు