2 నెలల్లో అందరికీ బీపీ పరీక్షలు

18 May, 2022 00:58 IST|Sakshi
సర్వే ఫలితాలు విడుదల చేస్తున్న హరీశ్‌ రావు 

పోస్ట్‌ కోవిడ్‌తో పెరిగిన హైపర్‌ టెన్షన్‌ 

ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో మూడోస్థానంలో రాష్ట్రం 

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్‌ పరీక్షలు చేస్తామని, ఇందుకు రూ.33కోట్ల నిధులు కేటాయించామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డేను పురస్కరించుకొని కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ)సహకారంతో, గ్లీనీగిల్స్‌ గ్లోబల్‌ ఆసుపత్రులు 9000 మందిపై చేసిన సర్వే ఫలితాలను హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో ఆయన మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ... సీఎస్‌ఐ సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యం, బాధను కల్గిస్తున్నాయన్నారు. కోవిడ్‌ బారిన పడినవాళ్లలో హైపర్‌ టెన్షన్‌ పెరిగినట్టు కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యని గుర్తించి 90లక్షల మందికి స్క్రీనింగ్‌ చేస్తే 13లక్షల మందికి హైపర్‌ టెన్షన్‌ ఉన్నట్టు తేలిందని చెప్పారు.

నిమ్స్‌ చేసిన ఓ సర్వే ప్రకారం... కిడ్నీ సమస్యలున్న వారిలో 60 శాతం మందికి హైపర్‌ టెన్షన్‌ ఉన్నట్టు వెల్లడైందన్నారు. ఇటీవలి కాలంలో ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారనీ, జీవనశైలి మార్పులు కూడా ఈ సమస్యను మరింత పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ, షుగర్‌ను ముందుగా గుర్తించి జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకంగా మారతాయని హెచ్చరించారు. 

బస్తీదవాఖానాలో పరీక్షల సంఖ్య పెంచుతాం..
 రాష్ట్రంలో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్న మంత్రి.. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌లో తెలంగాణ దేశంలోనే 3 స్థానంలో ఉందని, మరో నాలుగు నెలల్లో మొదటి స్థానంలోకి తీసుకొస్తామని తెలిపారు. నగరంలోని 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రస్తుతం 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని, వచ్చే నెల నుంచి ఆ సంఖ్యను 120కి పెంచుతామని తెలిపారు.

పరీక్షలతో పాటు ఉచితంగా మందులు ఇస్తున్నామని, అవి వాడుతున్నారో, లేదో తెలుసుకునేందుకు కాల్‌ సెంటర్‌నూ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. పరీక్షల ఫలితాల రిపోర్టులను 24 గంటల్లో మొబైల్‌ ద్వారా పేషెంట్‌కు, డాక్టర్లకు పంపిస్తున్నామని వివరించారు. ఆయుష్‌ ఆధ్వర్యంలో 450 వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ఆరోగ్యం పట్ల శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు