ప్రజలకు ఆనందబాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీటిబాష్పాలు 

24 Feb, 2023 03:48 IST|Sakshi

25 రోజుల్లో 50 లక్షల మందికి కంటి పరీక్షలు: హరీశ్‌రావు  

సాక్షి, సిద్దిపేట: కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలకు ఆనంద బాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీటి బాష్పాలు వస్తున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటిదాకా 50 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు.

25 పని దినాల్లో 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేశామన్నారు. గతంలో 827 బృందాలు పనిచేస్తే, ఈసారి 1500కు పెంచామని హరీశ్‌రావు తెలిపారు. 50 లక్షల మందికి పరీక్షలు చేస్తే 16 లక్షల మందికి దృష్టి లోపం ఉన్నట్టు తేలిందన్నారు. ఇప్పటివరకు 1,68,062 మందికి కంటి పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందని కొనియాడారు.  దక్షిణ భారత దేశ ధాన్యాగారంగా తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్చిదిద్దారని హరీశ్‌రావు చెప్పారు. దేశంలో వ్యవసాయం వృద్ధి రేటు 4% శాతం ఉంటే, రాష్ట్రంలో 7.8% శాతం ఉందన్నారు.

మరిన్ని వార్తలు