మాటలెక్కువ.. చేతలు తక్కువ 

21 May, 2022 01:45 IST|Sakshi
బీబీనగర్‌ ఎయిమ్స్‌ను పరిశీలిస్తున్న హరీశ్‌రావు  

కేంద్రంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

ఎయిమ్స్‌ను గాలికొదిలేశారు  

ఓపీ తప్ప ఇన్‌పేషెంట్‌ సేవలు లేవు 

ఒక్క డెలివరీ జరగలేదు.. ఆపరేషన్‌ థియేటర్‌ లేదు 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యత లేదు 

సాక్షి, యాదాద్రి: కేంద్ర ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించారు. భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అంతకుముందు.. బీబీనగర్‌ ఎయిమ్స్, భువనగిరి ఆస్పత్రి వద్ద మంత్రి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క ఎయిమ్స్‌ను కూడా గాలికొదిలేసిందన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండాల్సిన ఎయిమ్స్‌.. నిధుల లేమితో, సౌకర్యాలు లేక చతికిలబడిందన్నారు. ఎయిమ్స్‌లో పరిస్థితులపై కేంద్రానికి లేఖ ద్వారా వివరిస్తానని పేర్కొన్నారు.

ఈ ఆస్పత్రిలో ఓపీ సేవలే తప్ప ఇన్‌పేషంట్‌ సేవలు ఎక్కడ అని ప్రశ్నించారు. మూడేళ్ల క్రితం ఎయిమ్స్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 202 ఎకరాల స్థలం ఇస్తే ఇంత వరకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పటి వరకు బ్లడ్‌ బ్యాంక్, ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు చేయలేదని, ఒక్క డెలివరీ జరగలేదని విమర్శించారు. అవసరమైన సిబ్బంది నియామకాలు కూడా జరగలేదన్నారు.

812 నర్సు పోస్టులకు గాను ఇప్పటి వరకు 200 మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. కొత్త భవనాల నిర్మాణానికి అంచనాలు కూడా రూపొందించలేదని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎయిమ్స్‌కు వచ్చి... రాష్ట్రం నుంచి భూముల బదలాయింపు జరగలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడారని, కాగితాలతో సహా రుజువులు చూపిస్తే నాలుక కరుచుకున్నారని గుర్తు చేశారు. ‘నువ్వు వచ్చిపోవుడు కాదు, కేంద్ర మంత్రిగా ఎయిమ్స్‌ను పట్టించుకోవాలి’అని చురక వేశారు.

కిషన్‌రెడ్డికి ఏ మాత్రం బాధ్యత ఉన్నా కేంద్రంతో మాట్లాడి, అన్ని సదుపాయాలు కల్పించి ఎయిమ్స్‌లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ వాళ్లు మాటలకే పనికి వస్తారు తప్ప.. వారి వల్ల ఏదీ కాదన్నారు. ఇక్కడ చదువుతున్న 212 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు ప్రాక్టికల్స్‌ చేయడానికి ఏమీ లేకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వారికి అవకాశం కల్పించిందన్నారు. 

మరిన్ని వార్తలు