‘విద్యుత్‌’లో కేసీఆర్‌ పీహెచ్‌డీ  

21 Dec, 2022 02:33 IST|Sakshi
సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి   

రెడ్కో ఇంధన పొదుపు అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి జగదీశ్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ రంగంపై సీఎం కేసీఆర్‌కు ఉన్నంత అవగాహన, పట్టు దేశంలో మరెవరికీ లేదని, విద్యుత్‌లో ఆయన పీహెచ్‌డీ చేశారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంధన పొదుపు పురస్కారం తొలుత సీఎం కేసీఆర్‌కే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన అభివృద్ధి సంస్థ(టీఎస్‌రెడ్కో) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఇంధన పొదుపు పురస్కారాల–2022’ ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు.

గ్రామాల్లో విద్యుత్‌ వృథా అధికంగా ఉందని, అవసరం లేకున్నా లైట్లు వేసుకుంటున్నారని అన్నారు. దీనిపై గ్రామస్తుల్లో చైతన్యం తేవాలని కోరారు. ఇంధన పొదుపును పాఠ్యాంశంగా బోధించాలని మంత్రి సూచించారు. సమావేశంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘు మారెడ్డి, రెడ్కో చైర్మన్‌ సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. 

అవార్డు విజేతలు ఇలా.. ఇండస్ట్రీస్‌ విభాగంలో..  
ఐటీసీ లిమిటెడ్‌కు స్పెషల్‌ అవార్డు, మై హోం ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు గోల్డ్‌ అవార్డు, గ్రాన్యులెస్‌ ఇండియా లిమిటెడ్‌కు సిల్వర్‌ అవార్డు 
ఎడ్యుకేషనల్‌ బిల్డింగ్‌ విభాగంలో..  
వర్థమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌కు గోల్డ్‌ అవార్డు, విక్టోరియా మెమోరియల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు సిల్వర్‌ 
ప్రభుత్వ బిల్డింగ్‌ విభాగాల్లో..  
సంచాల భవన్‌కు గోల్డ్, లేఖా భవన్‌కు సిల్వర్‌ 
కమర్షియల్‌ బిల్డింగ్‌ విభాగంలో.. 
జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు స్పెషల్‌ అవార్డు, విప్రో లిమిటెడ్‌కు గోల్డ్,  
రైల్వేస్టేషన్‌ బిల్డింగ్‌ విభాగంలో... 
కాచిగూడకు గోల్డ్, సికింద్రాబాద్‌కు సిల్వర్‌ 
ట్రాన్స్‌పోర్ట్‌లో.. 
జనగాం డిపోకు గోల్డ్, ఫలక్‌నామా డిపోకు సిల్వర్‌.. నల్లగొండ మున్సిపాలిటీకి గోల్డ్, జీహెచ్‌ఎంసీకి సిల్వర్‌ అవార్డు.

మరిన్ని వార్తలు