పొలిటీషియన్లంటే..  గెస్ట్‌ ఆర్టిస్టులు అనుకుంటరు

18 Aug, 2021 01:36 IST|Sakshi

అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్య 

కేసీఆర్‌కు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చా.. 

ఆయన నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు 

నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదని వెల్లడి 

గీతం వర్సిటీలో విద్యార్థులు, లెక్చరర్లతో మాట్లాడిన మంత్రి 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్‌చెరు:  ‘‘ప్రభుత్వ పథకాల అమల్లో అవాంతరాలు ఉంటాయి. కొత్త ఆలోచనతో వచ్చే పథకాల విషయంగా.. అధికారుల నుంచి అమలు చేయలేమనే సమాధానమే మొదట వస్తుంది. రాజకీయ నాయకులు గెస్ట్‌ ఆర్టిస్టులని వారు భావిస్తారు. వారే పర్మినెంట్‌ ఆర్టిస్టులుగా భావిస్తారు..’’ అని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. మార్పు కోరడం అంత సులువైనది కాదని పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, లెక్చరర్లతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 

సక్సెస్‌కు షార్ట్‌కట్‌ ఉండదు 
మీ రాజకీయ జీవితంలో విఫలమైన ఘటనలు ఉన్నాయా అని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు శ్రీభరత్‌ ప్రశ్నించగా.. జీవితంలో వైఫల్యం చెందని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరని కేటీఆర్‌ బదులిచ్చారు. ‘‘ఫెయిల్యూర్‌ను సెలబ్రేట్‌ చేసుకోవాలి. మార్గం ఏదైనా కష్టపడి పనిచేయడానికి మించినది ఏదీ లేదు. సక్సెస్‌కు షార్ట్‌కట్‌ ఉండదు. నా జీవితంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ఆలస్యమైనప్పుడు కొంత బాధేసింది. ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇటీవల కేంద్ర మంత్రిని కలిసి.. హైదరాబాద్‌– బెంగూళూరు మధ్య డిఫెన్స్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరాను. కానీ యూపీలో పెట్టాలని నిర్ణయం జరిగిపోయిందని కేంద్రమంత్రి చెప్పారు. కారణం యూపీలో ఎంపీ సీట్లు ఎక్కువ, ఇక్కడ తక్కువ.’’ అని తెలిపారు. 

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరూ ఇవ్వలేరు 
రాష్ట్రంలో నియామకాల మాటేమిటని ఓ లెక్చరర్‌ ప్రశ్నించగా.. నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రైవేట్‌ ఎంప్లాయిమెంట్‌పై దృష్టి సారిస్తోందన్నారు. టీఎస్‌ఐపాస్‌తో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. 

పొలిటీషియన్లు తక్కువనే భావన ఉంటుంది 
పథకాల అమల్లో ఎదుర్కొన్న అవరోధాలేమైనా ఉన్నాయా అని ఓ విద్యార్థిని కేటీఆర్‌ను ప్రశ్నించింది. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘‘అధికారుల్లో అయితే తాము చాలా చదువుకున్నామని, పొలిటీషియన్లు తక్కువనే భావన ఉంటుంది. ఏదైనా కొత్త పథకాన్ని అమలు చేయాలని చెప్పగానే.. ‘అది సాధ్యం కాదు’ అనే సమాధానం ఐఏఎస్‌ అధికారుల నుంచి వస్తుంది. సహజంగానే ఈ రకమైన మైండ్‌సెట్‌ అందరిలోనూ ఉంటుంది. మార్పు కోరడం అంత సులువైంది కాదు. అది మానవ సహజ లక్షణం. అయితే బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులను గెస్ట్‌ ఆర్టిస్టులుగా భావిస్తారు. ఐదేళ్ల కాలానికి వచ్చిపోతారనే భావననే దీనికి కారణం. వారేమో పర్మనెంట్‌ ఆర్టిస్టులుగా భావిస్తుంటారు..’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సహా విద్యార్థులు, లెక్చరర్లు అందరూ గొల్లుమని నవ్వారు. 

నేను ఐఏఎస్‌ కావాలనుకున్నారు 
మరికొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలు ఇచ్చారు. తాను ఐఏఎస్‌ అవ్వాలన్నది తన తండ్రి కేసీఆర్‌ కోరికగా ఉండేదని చెప్పారు. ఢిల్లీలో చదువుకునేందుకు వెళ్లానని, మేనమామ ఒకరు ఇచ్చిన సలహాతో వదిలేశానని తెలిపారు. తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశానని.. ఉద్యోగ రీత్యా చాలా దేశాలు తిరిగానని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. తన తండ్రి కేసీఆర్‌కు చెప్పకుండానే 2008లో కార్యకర్తగా టీఆర్‌ఎస్‌లో చేరి, రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. 

దళితబంధుతో ఆర్థిక స్వావలంబన 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధిస్తాయని కేటీఆర్‌ చెప్పారు. గతంలో రైతుబంధు ప్రకటించినప్పుడు విమర్శలు వచ్చాయని.. కానీ ఇప్పుడా పథకాన్ని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. కేసీఆర్‌ దేన్నైనా సంకల్పిస్తే సాధించి తీరుతారని.. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ సంక్షేమ పథకాలను కొనసాగించేలా రూపకల్పన చేస్తున్నారని వివరించారు.  

‘మోదీ ఇచ్చే 15 లక్షలకు’ దరఖాస్తు చేసుకోండి బీజేపీపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రం
సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణ బీజేపీ దరఖాస్తులు స్వీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నా. జన్‌ధన్‌ ఖాతాల్లోకి ధనాధన్‌ లబ్ధి జరిగేందుకు తెలంగాణవాసులందరూ తమ దరఖాస్తులను బీజేపీ నాయకులకు పంపాల్సిందిగా కోరుతున్నా’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ కరీంనగర్‌ జిల్లా శాఖ చేపట్టిన దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.  

మరిన్ని వార్తలు