పారదర్శకత కోసమే టీఎస్‌బీపాస్‌

13 Feb, 2023 01:15 IST|Sakshi

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌  

ఈ విధానంలో అవినీతికి తావులేకుండా భవన నిర్మాణాలకు అనుమతులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులను అత్యంత పారదర్శకంగా జారీ చేసేందుకు టీఎస్‌ బీపాస్‌ను ప్రవేశపెట్టినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ఇదివరకు భవన నిర్మాణ అనుమతుల జారీలో భారీగా అవినీతి జరిగేదని, లంచాలు ఇచ్చి అనుమతులు పొందిన ఘటనలు అనేకమని అన్నారు. కానీ అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అనుమతులు ఇచ్చేందుకే టీఎస్‌ బీపాస్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు.

కేవలం 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని, నిర్దేశించిన గడువులోగా ఒకవేళ అనుమతి రాకుంటే ఆటోమేటిక్‌గా ఇచ్చినట్టే పరిగణించాలని పేర్కొన్నారు. టీఎస్‌ బీపాస్‌తో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు ఉంటాయన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆదివారం శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్‌ ఈ అంశంపై మాట్లాడారు. గృహ నిర్మాణ శాఖను రద్దుచేసి.. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు జీవో 111 స్థానంలో జీవో 69 తీసుకొచ్చామని తెలిపారు. హిమాయత్‌సాగర్‌ కలుషితం కాకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు.  

మెట్రోరైలు రెండోదశకు శ్రీకారం 
మెట్రోరైలు రెండోదశకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, శంషాబాద్‌ నుంచి మైండ్‌ స్పేస్‌ వరకు 31 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే రూ. 650 కోట్ల వ్యయంతో నిర్మించనుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ లైన్‌ కేవలం ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారి కోసమనే భావన ఉందని, కానీ అందులో వాస్తవం లేదని ఎవరైనా ఈ మార్గంలో ప్రయాణించవచ్చని స్పష్టంచేశారు.

ప్రజారవాణాను అభివృద్ధి చేయాలనే కోణంలోనే మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మరో రెండు మార్గాలకు సంబంధించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిందని, కానీ ఈ అంశంపైన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, కనీసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు.

అనంతరం మండలిలో తెలంగాణ మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. కాగా, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018 అనుసూచి–8కి సవరణ ద్వారా భద్రాచలం, సారపాక, రాజంపేట ఏజెన్సీ గ్రామాలను ఒకటి లేక అంతకు మించి గ్రామపంచాయతీలుగా ఏర్పాటు, ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం సవరణ బిల్లుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.  

మరిన్ని వార్తలు