పెట్టుబడులకు నిలయం.. తెలంగాణ 

9 Oct, 2021 02:28 IST|Sakshi
ఇండో–ఫ్రెంచ్‌ సదస్సులో కేటీఆర్‌ 

కేంద్ర ప్రభుత్వ విధానాల కోణంలోనే భారత్‌ను చూడొద్దు 

ఇండో–ఫ్రెంచ్‌ పెట్టుబడులసదస్సులో కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ విధానాల కోణంలోనే భారత్‌ను చూడొద్దని, తెలంగాణ లాంటి రాష్ట్రాలు భారీ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కలిగి ఉన్నాయని మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఐటీ, ఏరోస్పేస్, జీవ ఔషధాలు, ఫార్మా రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ ప్రధాన గమ్యస్థానంగా మారడంతో పాటు, అనేక ఫ్రెంచ్‌ కంపెనీలకు నిలయంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అనేక వినూత్న విధానాలను ప్రవేశపెడుతూ అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు.

హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం ఇండో–ఫ్రెంచ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఇఫ్సీ) ఆధ్వర్యంలో జరిగిన నాలుగో విడత ‘ఇండో–ఫ్రెంచ్‌ పెట్టుబడుల సదస్సు’ లో కేటీఆర్‌ ప్రసంగించారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఫ్రెంచ్‌ దేశానికి సంబంధించిన భారీ కంపెనీలతో పాటు మధ్యతరహా కంపెనీలను సైతం తెలంగాణకు ఆహ్వానించేం దుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.

 ఆవిష్కరణలకు కేంద్రంగా ఉన్న తెలంగాణలో ఫ్రెంచ్‌ కంపెనీలు పెట్టుబడులతో ముందుకురావడంతో పాటు అనేక అవకాశాలను పొందుతున్నాయ ని ఫ్రెంచ్‌ రాయబారి ఎమాన్యుయేల్‌ లెనైన్‌ అన్నారు. కోవిడ్‌ సంక్షోభ సమయంలో టిమ్స్‌ కోసం ఫ్రెంచ్‌ తయారీ ఆక్సీజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌ను ఫ్రాన్స్‌ అందజేసిన విషయాన్ని ఎమాన్యుయేల్‌ గుర్తు చేశారు.  

ఎయిర్‌పోర్ట్‌ సామర్థ్యం పెంపు... 
గత ఏడాది ఫిబ్రవరిలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (జీఐఎల్‌).. ఎయిర్‌పోర్ట్స్‌ బిజినెస్‌ గ్రూప్‌(ఏడీపీ)తో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఎయిర్‌పోర్ట్‌లో 49శాతం వాటాను పొందినట్లు జీఎంఆర్‌ డిప్యూటీ సీఈఓ ఆంటోనీ క్రోంబెజ్‌ వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌ సామర్థ్యాన్ని 3.4 కోట్ల ప్రయాణిలకు పెంచేందుకు రూ.6,300 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించారు. సదస్సులో ఇఫ్సీ అధ్యక్షుడు సుమిత్‌ ఆనంద్, డైరెక్టర్‌ జనరల్‌ పాయల్‌ ఎస్‌ కన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఇండో–ఫ్రెంచ్‌ పెట్టుబడుల సదస్సులో కేటీఆర్‌తో పాటు భారత్‌లో ఫ్రెంచ్‌ రాయబారి ఎమాన్యుయెల్‌ లెనైన్, వంద మందికి పైగా వివిధ కంపెనీల సీఈలు, చీఫ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఆఫీసర్లు (సీఎక్స్‌ఓలు), రాయబారులతో కూడిన ఫ్రెంచ్‌ పెట్టుబడుదారుల బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్‌ ప్రతినిధుల బృందంహైదరాబాద్‌లో ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్రెంచ్‌ కంపెనీలు సాఫ్రాన్‌ ఇంజిన్స్, మానే ఇండియా, సనోఫీ శాంత బయోటెక్‌లను ఫ్రెంచ్‌ ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయిలో సందర్శించింది.

గతంలో ఈ సదస్సులు నాగపూర్‌ (2018), గోవా (2019), 2020లో కోవిడ్‌ కారణంగా సదస్సు జరగలేదు. దీంతో ఈ ఏడాది ఆరంభంలో తమిళనాడు (2021)లో జరిగింది. భారత్‌ ఫ్రెంచ్‌ నడుమ వాణిజ్య బంధం బలోపేతం చేసేందుకు పురోగమిస్తున్న రాష్ట్రాల్లో ఈ సదస్సులు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు