డ్రోన్‌ అంటే కెమెరా ఒక్కటే కాదు!

1 Feb, 2023 02:41 IST|Sakshi
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి కేటీఆర్‌  

భద్రత కోసం వాడొచ్చు.. పొలాల్లో పురుగు మందులూ చల్లొచ్చు 

కమలాపూర్‌ గురుకుల విద్యార్థులతో మంత్రి కేటీఆర్‌ ముచ్చట్లు 

ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచన

నాన్‌వెజ్‌ బందు చేశానని.. పప్పు, చారు, పెరుగుతో ముగిస్తున్నానని వెల్లడి 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ‘‘పిల్లలూ డ్రోన్‌ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? డ్రోన్‌ అంటే కెమెరా ఒక్కటే కాదు.. దానితో పొలాల్లో పురుగుమందు స్ప్రే చేయవచ్చు.. అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చు. గుట్టలు, చెరువులు, కుంటల సరిహద్దులను నిర్ధారించవచ్చు. సరిహద్దుల్లో ఎవరు చొరబడకుండా చూడవచ్చు. భవిష్యత్‌లో మనుషులను తీసుకెళ్లే వాహనం కూడా అవుతుంది’’అంటూ గురుకుల విద్యార్థులతో మంత్రి కేటీఆర్‌ చిట్‌చాట్‌ చేశారు.

మంగళవారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్, గూడూరు శివారులో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్‌ బాలుర, బాలికల గురుకుల పాఠశాల భవనాలను కేటీఆర్‌ ప్రారంభించారు. తర్వాత విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేశారు. ఈ సందర్భంగా కవరేజ్‌లో భాగంగా ఆ వైపు వచ్చిన డ్రోన్‌ను చూసిన కేటీఆర్‌ దానివల్ల ఏమేం చేయొచ్చో విద్యార్థులకు వివరించారు.

చదువుకుని ఏమవుతారని, ఉద్యోగం చేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగం చేయడమే కాకుండా పది మందికి ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. ఇక్కడ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ చదివే పిల్లలను హైదరాబాద్‌లోని టీ–హబ్‌కు తీసుకువెళ్లి చూపించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. తాను నాన్‌వెజ్‌ బంద్‌ చేశానని.. అందుకే పప్పు, చారు, పెరుగుతో ముగిస్తున్నానని విద్యార్థులకు చెప్పారు. 

భారీగా అభివృద్ధి పనుల ప్రారంభం 
హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం గూడూరు, కమలాపూర్‌ గ్రామాల్లో రూ.49 కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

కమలాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శిలాఫలకాలను ఆవిష్కరించారు. తర్వాత కుల సంఘాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. కాగా.. మంత్రి కేటీఆర్‌ పర్యటన సమయంలో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కాన్వాయ్‌లోకి చొరబడి నల్లచొక్కాలతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు