అణాపైసా ఇవ్వలేదు

24 Mar, 2021 02:10 IST|Sakshi

పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని విభజనచట్టంలో ఉన్నా కేంద్రంలో స్పందన లేదు

ఆత్మనిర్భర్‌ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు

శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా కేంద్రం ఆరున్నరేళ్లలో రాష్ట్రానికి అణాపైసా కూడా ఇవ్వలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ధ్వజమెత్తారు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణకు సహాయం చేయాలని, రాయితీలు ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ ఎలాంటి సాయం చేయలేదన్నారు. పార్లమెంట్‌లో తాను చేసిన చట్టాలనే కేంద్రం తుంగలో తొక్కుతోందన్నారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్‌ ఐపాస్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. పరిశ్రమలను ఆదుకోవాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చట్టాలను గౌరవించి, ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. ఇక కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌తో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం దక్కలేదన్నారు. దీనికింద ప్రకటించిన రూ.20 లక్షల నిధులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదన్నారు.

ఈ పథకం వల్ల కేవలం వీధి వ్యాపారులకు మాత్రం కొంత ప్రయోజనం కలిగిం దన్నారు. గడిచిన ఆరేళ్లలో టీఎస్‌–ఐపాస్‌ కింద 15,326 పరిశ్రమలు ఆమోదం పొందగా, ఇందులో 11,954 పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. మొత్తంగా రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించగా, ఇందులో రూ.97 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 15.52 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని భావించగా, ఇప్పటివరకు 7.67 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. ఇక రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిధ్దం చేస్తున్నామని, ఆయా జిల్లాల్లో సాగయ్యే పంటలకు అనుగుణంగా ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు ‘ఫుడ్‌ మ్యాప్‌ ఆఫ్‌ తెలంగాణ’ను సిధ్దం చేశామన్నారు. వెనుకబడిన జిల్లాలకు కూడా పరిశ్రమలను విస్తరిస్తామని మంత్రి తెలిపారు. 

మాంసానికి తెలంగాణ బ్రాండింగ్‌: తలసాని 
మాంసం ఉత్పత్తిలో ఇప్పటికే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా మాంసానికి బ్రాండింగ్‌ చేస్తామన్నారు. డీడీలు కట్టిన 28,583 మందికి త్వరలోనే గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ తర్వాత దాని నుంచి వచ్చిన సంపద రూ.5,490 కోట్లని తెలిపారు. గొర్రెల పంపిణీపై ఇంతవరకు రూ.4,587 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రెండో విడతలో 3.50 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. ఈ బడ్జెట్‌లో గొర్రెల పంపిణీకి రూ.3 వేల కోట్లు కేటాయించామన్నారు. 

83 రెసిడెన్షియల్‌ పాఠశాలలు జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌: కొప్పుల
రాష్ట్రంలో 204 మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉండగా, ఇందులో 2018–19లో 12 పాఠశాలలను, 2020–21లో 71 పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ పాఠశాలల్లో మొత్తంగా 30,560 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 7,570 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని మంత్రి తెలిపారు.


  

మరిన్ని వార్తలు