హనుమాన్‌ గుడి లేని ఊరు.. పథకాలు అందని ఇల్లు లేదు 

1 Mar, 2023 00:50 IST|Sakshi
ఎల్లారెడ్డిపేటలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో ట్యాబ్‌లు అందించి విద్యార్థినులతో మంత్రి కేటీఆర్‌ 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారకరామారావు 

సిరిసిల్లలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ.. ఎల్లారెడ్డిపేటలో తొలి వృద్ధాశ్రమం ప్రారంభం 

సిరిసిల్ల: రాష్ట్రంలో ‘హనుమాన్‌ గుడిలేని ఊరు, కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంగళవారం నాలుగు వందల మంది పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్‌ భగీరథ నీళ్లు, గురుకులాల్లో విద్య, ఆసరా పెన్షన్‌... ఇలా ఏదో ఒక్క పథకంలో పక్కాగా ప్రతి ఒక్క కుటుంబం లబ్ధిపొందుతోందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ సంక్షేమ పాలనకు ఇది నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు ఇస్తామని, డబుల్‌ బెడ్రూం ఇల్లు రానివారికి ‘రూ.3 లక్షల ఇల్లు’పథకంలో అవకాశం కల్పిస్తామని అన్నారు. స్థలం లేని వారికి స్థలం, ఇల్లు కట్టుకోడానికి నిధులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. అర్హులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. 

మోదీకి ఇష్టం లేకున్నా.. మనమే నంబర్‌ వన్‌ 
తెలంగాణ అంటే ప్రధాని మోదీకి ఇష్టం లేకున్నా.. దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా నంబర్‌ వన్‌గా నిలిచిందని కేటీఆర్‌ అన్నారు. సోమవారం కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ విభాగంలో రాజన్న సిరిసిల్ల నంబర్‌ వన్‌గా ఉందని, రెండోస్థానంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లా, మూడో స్థానంలో పెద్దపల్లి జిల్లా ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు.

కేటీఆర్‌ తన పుట్టిన రోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లోని కాలేజీ విద్యార్థులకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా రెండు వేల మందికి ట్యాబ్‌లు పంపిణీ చేశారు. వేములవాడ నియోజకవర్గంలోని పిల్లలకు మరో 3 వేల ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో ట్యాబ్‌ విలువ రూ.86 వేలు ఉంటుందన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే పిల్లలు ఐఐటీ, నీట్‌ ఎంట్రన్స్‌ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలని, ప్రపంచంతో పోటీ పడేస్థాయికి చేరాలని పిలుపునిచ్చారు.  

రాష్ట్రంలో తొలి వృద్ధాశ్రమం 
రాష్ట్రంలోనే తొలి వృద్ధాశ్రమాన్ని మంత్రి కేటీఆర్‌ ఎల్లారెడ్డిపేటలో ప్రారంభించారు. ఎస్టీ హాస్టల్‌ భవనాన్ని రూ.40 లక్షలతో ఆధునీకరించి వృద్ధుల ఆశ్రమం, డే కేర్‌ సెంటర్‌గా మార్చారు. 25 పడకలతో కూడిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి యోగా కేంద్రం, ఫిజియోథెరపీ, డాక్టర్‌ రూం, వ్యాయామ శాల, గేమ్స్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులతో మంత్రి కేటీఆర్‌ క్యారంబోర్డు ఆడారు. వారితో కలిసి భోజనం చేశారు. వృద్ధులతో చాలాసేపు ముచ్చటించారు. 

మరిన్ని వార్తలు