లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా తెలంగాణ

29 Apr, 2022 02:36 IST|Sakshi
థర్మోíఫిషర్స్‌ సైంటిఫిక్‌ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ 

‘థర్మో ఫిషర్‌’ పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

పెట్టుబడులకు, సంస్థల విస్తరణకు తెలంగాణ స్వర్గధామం

ఇప్పటికే నగరంలో ఐడీపీఎల్, ఇక్రిశాట్, సీఎస్‌ఐఆర్‌ వంటి సంస్థలు

గచ్చిబౌలి: భారత్‌లోనే కాకుండా యావత్‌ ఆసియా ఖండంలోనే లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి కీలక హబ్‌గా తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పెట్టుబడులు, సంస్థల విస్తరణకు ఈ ప్రాంతం గమ్యస్థానంగా మారిందని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లోని నాలెడ్జి సిటీలో మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ «థర్మో ఫిషర్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందన్నారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూనీటి వనరులపై పరిశోధన చేస్తోందని చెప్పారు. గత నెల తాను చేపట్టిన అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్‌లో థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ప్రతినిధులను కలిసినట్లు కేటీఆర్‌ వివరించారు.

నగరంలో ఇప్పటికే ఐడీపీఎల్, ఇక్రిశాట్, సీఎస్‌ఐఆర్‌ వంటి ఎన్నో ముఖ్యమైన పరిశోధనా కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు కూడా హైదరాబాద్‌ మంచి ప్రదేశమని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో నైపుణ్యంగల వర్క్‌ఫోర్స్‌ అందుబాటులో ఉండటంతోపాటు ప్రభుత్వ సానుకూల విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలికవసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, థర్మోఫిషర్‌ సైంటిఫిక్‌ ఏసియా పసిఫిక్‌ అండ్‌ జపాన్‌ అధ్యక్షుడు టోని అసియారిటో, థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ఇండియా సౌత్‌ ఏసియా ఎండీ అమిత్‌ మిశ్రా, థర్మో ఫిషర్‌ ఆపరేషన్స్‌ లేబొరేటరీ ఎక్విప్‌మెంట్‌ ఉపాధ్యక్షుడు మైఖేల్‌ మెగుయర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు