ఈ కామర్స్‌తో చేనేతకు చేదోడు

8 Aug, 2021 04:40 IST|Sakshi
హైదరాబాద్‌ లోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌లో మగ్గాన్ని పరిశీలిస్తున్న కేటీఆర్‌

విస్తృతంగా ప్రచారం కల్పిస్తాం

పీపుల్స్‌ ప్లాజాలో చేనేత ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 

చేనేత బడ్జెట్‌ను రూ.1,200 కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్‌దేనన్న మంత్రి 

ఖైరతాబాద్‌: ఈ కామర్స్‌ ద్వారా చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు పరిశ్రమలు, ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. టెస్కో ఆధ్వర్యంలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులకు కొత్తదనం తీసుకువస్తున్నామని చెప్పారు. శనివారం చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పీపుల్స్‌ప్లాజా వేదికగా వారంపాటు ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. స్టాళ్లలోని వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీతాంబరం, ఆర్మూర్‌ చీరల పునరుద్ధరణ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ఈ గోల్కొండ వెబ్‌సైట్‌తోపాటు చేనేత ఫ్యాషన్‌ షోను మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.

31 మంది చేనేత కళాకారులను సత్కరించి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డులను అందజేశారు. కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత చేనేత, జౌళి శాఖ బడ్జెట్‌ను రూ.70 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ నేతన్నలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, కళలలకు వైభవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్‌ కాటన్, సిల్క్‌ చీరలు, నారాయణపేట కాటన్, వరంగల్‌ జరీలు, కరీంనగర్‌ బెడ్‌షీట్లు తెలంగాణ కళాకారుల అత్యున్నత నైపుణ్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అద్భుత చేనేత కళాకారులను గుర్తించి సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయస్థాయి చేనేత ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కళాకారులు కూడా తమ ఉత్పత్తులను ఇక్కడ విక్రయించుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. 

25,319 మందికి చేనేతమిత్ర
చేనేతమిత్ర పథకం ద్వారా 25,319 మంది చేనేత, అనుబంధ కార్మికుల బ్యాంక్‌ ఖాతాల్లో ఇప్పటివరకు రూ.13 కోట్ల 34 లక్షలు జమ చేసినట్లు కేటీఆర్‌ తెలిపారు. చేనేత కార్మికుల రుణమాఫీ పథకం ద్వారా 2010 నుంచి 2017 వరకు తీసుకున్న రుణాలపై రూ.28 కోట్ల 96 లక్షల మేర మాఫీ చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చామన్నారు. అందరం బాధ్యతగా ముందుకొచ్చి చేనేత రంగాన్ని బతికించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు