సంక్రాంతి నాటికి ‘డబుల్‌’ లబ్ధిదారుల గుర్తింపు 

30 Nov, 2022 01:45 IST|Sakshi

సిరిసిల్ల జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి కె.తారక రామారావు 

సంతృప్తస్థాయిలో ఇళ్ల మంజూరు.. 

సిరిసిల్ల: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నామని, ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగులతో నిర్మించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అర్హులను సంక్రాంతి నాటికి గుర్తించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రం ఏర్పడక ముందు 200 గురుకులాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యికి పెరిగిందని, ఇది సీఎం కేసీఆర్‌ సాధించిన ఘనత అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆయా రంగాల్లో సాధించిన ప్రగతి నివేదికలను మార్చిలోగా రూపొందించాలని కేటీఆర్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిందని, జేఎన్‌టీయూ, మెడికల్‌ కాలేజీ, వ్యవసాయ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరయ్యాయని వివరించారు.

సంక్రాంతి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9 పనులను పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. సిరిసిల్ల మధ్యమానేరు నుంచి కోనరావుపేట మండలం మల్కపేట వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని, రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, సొరంగంలో లైనింగ్‌ పనులు పూర్తి చేసి మధ్యమానేరు నీటితో మల్కపేటను నింపాలని సూచించారు. అనంతరం తనను కలిసిన గౌడ సంఘం జిల్లా నాయకులతో కేటీఆర్‌ మాట్లాడుతూ అర్హులైన గీత కార్మికులకు మోపెడ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు.

మరిన్ని వార్తలు