50 ఏళ్ల వరకు హైదరాబాద్‌లో.. తాగునీటికి ఢోకా ఉండదు

15 May, 2022 01:16 IST|Sakshi

రాబోయే వేసవి నాటికి సుంకిశాల పంపింగ్‌ స్టేషన్‌ పూర్తి: కేటీఆర్‌ 

బుద్ధవనాన్ని మరింత అభివృద్ధి చేద్దాం.. పెట్టుబడులను ఆహ్వానిద్దాం

పెద్దవూర/నాగార్జునసాగర్‌: ‘హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు భవిష్యత్‌లో తాగునీటికి, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా రూ.1,450 కోట్లతో సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌ పంపింగ్‌ స్టేషన్‌ నిర్మిస్తున్నాం. వచ్చే వేసవి నాటికి దీన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’అని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జంటనగరాలకు వచ్చే 50 ఏళ్ల వరకు తాగునీటికి ఢోకా ఉండదని అన్నారు.

నగరానికి సరిగ్గా 50 ఏళ్ల నాటికి 2072లో 70.97 టీఎంసీల నీరు అవసరమని, దీనికి తగ్గట్టు ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద నిర్మిస్తున్న భారీ ఇన్‌టేక్‌ వెల్‌ పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణానికి మంత్రులు మహమూద్‌ అలీ, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్‌ శనివారం శంకుస్థాపన చేశారు.

తర్వాత ఆయన మాట్లాడుతూ.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం హైదరాబాద్‌ అని, మరో 15 ఏళ్లలో దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద నగరం అవుతుందని చెప్పారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ 159 కిలోమీటర్ల మేర వాటర్‌ పైప్‌లైన్లు (రింగ్‌ మెయిన్‌)లు వేయాలని నిర్ణయించామని.. దీంతో కృష్ణా, గోదావరి నీళ్లను నగరంలోని ఏ ప్రాంతాలకైనా అందించేందుకు వీలవుతుందని వివరించారు.

వరుసగా ఐదేళ్లు కరువు వచ్చినా తాగునీటికి ఇబ్బంది లేకుండా, ఒక సిస్టమ్‌లో లోపం వచ్చినా మరో సిస్టమ్‌ ద్వారా తాగునీరు అందేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. అంతకుముందు ఇన్‌టేక్‌ వెల్‌ పనులను టన్నెల్‌లోకి వెళ్లి కేటీఆర్‌ పరిశీలించారు. 

కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం: తలసాని, సబిత
హైదరాబాద్‌ ప్రజలం సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని మంత్రులు తలసాని, సబితారెడ్డి అన్నారు. నగర ప్రజలకు కొండపోచమ్మ నుంచి గోదావరి జలాలను, సుంకిశాల నుంచి కృష్ణా జలాలను తరలించే ప్రాజెక్టులకు కేసీఆర్‌ రూపకల్పన చేశారని చెప్పారు. 

దలైలామాను ఆహ్వానిద్దాం
ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ మహాస్తూపం నిర్మితమైన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసేందుకు బౌద్ధ దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిద్దామని కేటీఆర్‌ అన్నారు. బుద్ధవనాన్ని ప్రారంభించిన అనంతరం మహాస్తూపంలోని ఆడిటోరియంలో ఆయన మాట్లాడారు.

సీఎం విజన్‌కు తగినట్టు మల్లే్లపల్లి లక్ష్మయ్య, నాగిరెడ్డి ఈ బుద్ధవనాన్ని తీర్చిదిద్దారన్నారు. సీఎం అనుమతితో జరగబోయే కార్యక్రమాలకు దలైలామాను ఆహ్వానిద్దామన్నారు. తెలంగాణలోని ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, బాదన్‌కుర్తి లాంటి బౌద్ధ ప్రాం తాలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు