బాసరకు మంత్రి కేటీఆర్‌

26 Sep, 2022 01:18 IST|Sakshi

కేటీఆర్‌ వెంట సబితాఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా..

నిర్మల్‌: ఎట్టకేలకు బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులను ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కలవనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఆర్జీయూకేటీకి రానున్నారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్‌ ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం దీపాయిగూడకు వెళ్లనున్నారు. అక్కడ జోగు రామన్నను పరామర్శించి బాసరకు రానున్నారు. 

విద్యార్థులతో మాటాముచ్చట.. 
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రులు ఆర్జీయూకేటీ చేరుకోనున్నారు. ముందుగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆ తర్వాత వారితో మాట్లాడనున్నారు. రెండు గంటలు కేటీఆర్‌తోపాటు సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి వర్సిటీలో ఉండనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఇందుకు సీఎం లేదా మంత్రి కేటీఆర్‌ తమవద్దకు రావాలని జూన్‌లో విద్యార్థులు వారంపాటు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడిచ్చిన హామీ మేరకు కేటీఆర్‌ క్యాంపస్‌కు వస్తున్నట్లు చెబుతున్నారు. కేటీఆర్‌ రాకతో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. 

మరిన్ని వార్తలు