ధాన్యాన్ని కేంద్రమే కొనాలి: మంత్రి వేముల

31 Mar, 2022 03:52 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పంజాబ్‌ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం జరిగిన నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో రైతులు పెద్దఎత్తున వరి పండిస్తున్నారన్నారు.

ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే 2014లో 4.29లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇప్పుడు రెట్టింపు స్థాయిలో 7.14లక్షల ఎకరాల్లో  పండిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరిత వైఖరి మానుకోవాలని హితవు పలికారు. జడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. యాసంగిలో తెలంగాణ రైతులు సాగు చేసిన ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరుతూ చైర్మన్‌ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

మరిన్ని వార్తలు