ఎన్నికల ఎఫెక్ట్‌: మంత్రి పువ్వాడకు రెండోసారి కరోనా

1 May, 2021 19:20 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు రెండోసారి కరోనా సోకింది. మొదటి వేవ్‌లోనే మంత్రి అజయ్‌కు కరోనా సోకగా తాజాగా మరొకసారి పాజిటివ్‌ తేలడం ఆందోళన రేపుతోంది. తేలికపాటి లక్షణాలు ఉండడంతో శుక్రవారం ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా శనివారం రిపోర్ట్ వచ్చింది. అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వెంటనే తన నివాసంలో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు.

ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి వెల్లడించారు. వారం రోజులుగా తనను కలిసిన వారు కూడా పరీక్షలు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే యథావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను అని మంత్రి ట్వీట్‌ చేశారు.

అయితే మంత్రి అజయ్‌ ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎన్నికల వలన పెద్ద ఎత్తున కరోనా సోకుతుందని ఖమ్మంలో ప్రచారం జరుగుతోంది. మొన్న నాగార్జున సాగర్‌ ఎన్నిక అనంతరం ఏ జరిగిందో చూశాం. సీఎం కేసీఆర్‌తోపాటు పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఖమ్మం నగరంలో కూడా అదే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

చదవండి: సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది.. 
చదవండి: ‘భారత్‌ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం

మరిన్ని వార్తలు