చెప్పుల్లేని విద్యార్థులు.. చలించిన మంత్రి 

17 Apr, 2022 03:39 IST|Sakshi
విద్యార్థులను పిలిచి మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు కాళ్లకు చెప్పుల్లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కంటపడ్డారు. ఆమె వెంటనే కాన్వాయ్‌ని ఆపి విద్యార్థులతో మాట్లాడి వారికి మంచినీళ్లు, చాక్లెట్లు, షూస్, స్నాక్స్‌ అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు.

అనంతరం అటు నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి రోడ్డుమార్గంలో బయల్దేరారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండల్లో మామిడిపల్లి వద్ద పలువురు విద్యార్థులు కాళ్లకు చెప్పుల్లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ మంత్రి కంటపడ్డారు. చలించిన మంత్రి వారిని దగ్గరికి పిలిచి ఆప్యాయంగా పలకరించారు. టీఆర్‌ఎస్‌ నేత నిమ్మల నరేందర్‌గౌడ్‌కు ఫోన్‌ చేసి, వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వెంటనే ఆయన ఆయా విద్యార్థులకు షూస్‌ సహా స్నాక్స్, నీరు అందజేశారు. దీంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు.

మరిన్ని వార్తలు