కేంద్రానికి రాష్ట్రమంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ విజ్ఞప్తి 

28 Sep, 2022 04:27 IST|Sakshi

అవార్డులు కాదు, రివార్డులు ఇవ్వాలి 

సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులపాలు చేయొద్దని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్నిరంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, కేంద్రం ప్రకటిస్తున్న అవార్డుల్లోనూ తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. ఇటీవల ఇచ్చిన సంసద్‌ ఆదర్శ్‌ గ్రామయోజన, స్వచ్ఛభారత్‌లో అవార్డులు గెలుచుకున్న తెలంగాణ మంగళవా రం కేంద్ర పర్యాటక శాఖ ఇచ్చిన జాతీయ పర్యాటక అవార్డుల్లో మూడో ఉత్తమ రాష్ట్రంగా అవార్డు అందుకున్నామని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ దేశ జీడీపీలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఇప్ప టికైనా సీఎం కేసీఆర్‌ చేస్తున్న పనులను ప్రధాని మోదీ గుర్తించాలని కోరారు.  తెలంగాణ పురోగమిస్తున్నందునే కేంద్రం అవార్డులు అందిస్తోందని, తాము చేస్తున్న పనులు తప్పు అయితే తెలంగాణకు ఇన్ని అవార్డులు ఎలా వస్తున్నాయో కేంద్రం ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా తెలంగాణతో కేంద్రం పోటీపడాలని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే భారత్‌ నంబర్‌ వన్‌ అవుతుందన్నారు. 

మరిన్ని వార్తలు