ఉద్యమకారులకు స్ఫూర్తి.. కాళోజీ 

10 Sep, 2021 01:17 IST|Sakshi
కవి శివరామకృష్ణను సన్మానిస్తున్న మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌.  చిత్రంలో గోరటి వెంకన్న, కేవీ రమణాచారి, రసమయి, మామిడి హరికృష్ణ తదితరులు 

ప్రజాకవి జయంతి వేడుకల్లో మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌

కవి పెన్నా శివరామకృష్ణకు కాళోజీ పురస్కారం ప్రదానం   

గన్‌ఫౌండ్రీ: తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన ప్రజా కవి కాళోజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ, కాళోజీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కవులు, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠ్య పుస్తకాలలో కాళోజీ జీవిత చరిత్రను పొందుపరిచామని, కాళోజి పేరుమీద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి డాక్టర్‌ పెన్నా శివరామకృష్ణకు కాళోజీ పురస్కారాన్ని అందజేశారు.

కార్యక్రమంలో శాసనసభ్యులు రసమయి బాలకృష్ణ, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణతో పాటు కవులు, కళాకారులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు